మహిళ హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు – కోర్టు మానిటరింగ్ సెల్ సత్ఫలితాన్ని ప్రశంసించిన ఏలూరు ఎస్పీ


ఏలూరు జిల్లా, చింతలపూడి: ఏలూరు జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోర్టు మానిటరింగ్ సెల్ పర్యవేక్షణలో మరో కీలక విజయం నమోదైంది. చింతలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో 2023లో జరిగిన మహిళా హత్య కేసులో నేరం రుజువు కావడంతో ముద్దాయికి జీవిత ఖైదు శిక్ష ఖరారైంది. నేరం జరిగిన మూడేళ్లలోపే తీర్పు రావడం పోలీస్ శాఖ సమర్థతకు నిదర్శనంగా నిలిచింది.


చింతలపూడి పీఎస్ క్రైమ్ నెంబర్ 57/2023 (SC No.193/2024) కేసులో ఏలూరు 2వ అడిషనల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి గౌరవ న్యాయమూర్తి శ్రీమతి యు. ఇందిరా ప్రియదర్శిని నేడు చారిత్రాత్మక తీర్పు వెలువరించారు. బందంచెర్ల గ్రామానికి చెందిన శ్రీకాకొల్లు సువర్ణరాజు(39) అనే ముద్దాయిపై హత్య ఆరోపణలు పూర్తిగా రుజువైనట్లు కోర్టు తేల్చింది.

మరణించిన కంచర్ల సునీత @ గంగ (35)తో ముద్దాయికి ఉన్న వివాహేతర సంబంధం నేపథ్యంలో, ఆమె ఇతరులతో ఫోన్‌లో మాట్లాడుతుందనే అనుమానంతో అసూయ పెంచుకున్న ముద్దాయి హత్యకు పథకం రచించాడు. 20-01-2023న చింతలపూడి మండలం బాలవారి గూడెం అడవి ప్రాంతానికి ఆమెను తీసుకెళ్లి, అక్కడ దాడి చేసి చీరతో ఉరి బిగించి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఆధారాలు మాయం చేయాలనే ఉద్దేశంతో శవాన్ని కొండ దిగువన రాళ్లపై పడేశాడు.

ఈ కేసులో ముద్దాయిపై మోపబడిన నేరాలు నిరూపితమవడంతో, సెక్షన్ 302 ఐపీసీ కింద జీవిత ఖైదు మరియు రూ.3,000 జరిమానా, సెక్షన్ 201 ఐపీసీ కింద 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.

ఈ కేసును అప్పటి చింతలపూడి ఇన్స్పెక్టర్, ప్రస్తుత ఎస్‌బీ ఇన్స్పెక్టర్ ఎం.వి.ఎస్. మల్లేశ్వరరావు దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్ సెల్ అధికారులు సాక్షులను సకాలంలో కోర్టుకు హాజరుపరిచారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చింతమనేని రమేష్ బలమైన వాదనలు వినిపించడంతో కేసు పటిష్టంగా నిలిచింది.

చింతలపూడి సీఐ క్రాంతికుమార్, సిఎంసీ ఇన్స్పెక్టర్ ఎం. సుబ్బారావు, ఎస్ఐ సతీష్ కుమార్, అలాగే హెడ్ కానిస్టేబుళ్లు ఎం. రాజేష్, ఎం. నాగేశ్వరరావు, ఎం. శ్రీనివాస్, బి. మల్లికార్జునరావు లు సాక్ష్యాధారాల సేకరణలో కీలక పాత్ర పోషించారు.

బాధితులకు న్యాయం చేకూర్చడంలో కోర్టు మానిటరింగ్ సెల్ పాత్రను జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ ప్రత్యేకంగా కొనియాడారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ ప్రశంసాపత్రం అందజేసి అభినందించారు. నేరస్తులకు శిక్ష పడేలా చేయడం ద్వారా సమాజంలో శాంతి భద్రతలు మరింత బలపడతాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.