పెదపాడు కొత్తూరులో ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’పై బాలికలకు పోలీసుల అవగాహన కార్యక్రమం


ఏలూరు జిల్లా, పెదపాడు: ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ మార్గదర్శకత్వంలో పెదవేగి సర్కిల్ పరిధిలో బాలికల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పెదవేగి ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజశేఖర్ తమ సిబ్బందితో కలిసి పెదపాడు మండలం కొత్తూరు గవర్నమెంట్ బాలికల హై స్కూల్‌లో ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.


ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ, బాలికలపై జరిగే వేధింపులను నివారించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు, వారి హక్కులు, రక్షణ మార్గాల గురించి వివరంగా తెలియజేశారు. విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అనుమానాస్పద ఘటనలు ఎదురైతే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.

పెదవేగి సర్కిల్ వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల వద్ద ఆకతాయిల వేధింపులు జరగకుండా శక్తి యాప్ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే డ్రోన్ కెమెరాల సహాయంతో స్కూల్‌లు, కాలేజీల పరిసరాల్లో గస్తీ నిర్వహిస్తూ అనుమానాస్పద వ్యక్తులపై పర్యవేక్షణ కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తూరు గవర్నమెంట్ బాలికల హై స్కూల్ విద్యార్థినులకు అట్టలు, పెన్నులు, పెన్సిళ్లు తదితర విద్యా సామగ్రిని ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజశేఖర్ గారు బహూకరించారు. ఇది విద్యార్థినుల్లో మరింత ఉత్సాహం నింపింది.

ఏవైనా వేధింపులు ఎదురైనప్పుడు డయల్ 112, 181 లేదా శక్తి టోల్ ఫ్రీ నెంబర్ 7993485111కు కాల్ చేయాలని స్పష్టంగా తెలియజేశారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా విద్యార్థినుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని, సురక్షిత వాతావరణంపై నమ్మకం బలపడిందని అధికారులు పేర్కొన్నారు.

ఇలాంటి అవగాహన కార్యక్రమాలను పెదవేగి సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్‌ల పరిధిలో కొనసాగించేందుకు పోలీస్ శాఖ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు ఇన్స్పెక్టర్ రాజశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, అధ్యాపకులు, విద్యార్థినులు మరియు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.