రైల్వే క్రాసింగుల్లో ట్రాఫిక్ సమస్యల నివారణకు ఆర్వోబి పనులు వేగవంతం చేయాలి— జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి


ఏలూరు జిల్లా, ఏలూరు: రైల్వే క్రాసింగుల వద్ద తరచూ ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలను నివారించే లక్ష్యంతో జిల్లాలో చేపడుతున్న రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు (ROB) నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.


జిల్లా కలెక్టరేటులోని గౌతమీ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన ఆర్వోబి పనుల ప్రగతిపై సమీక్షా సమావేశంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌లతో కలిసి కలెక్టరు సమీక్షించారు. ఈ సమావేశంలో ఏలూరు, దెందులూరు, కైకలూరు, ఉంగుటూరు నియోజకవర్గాలకు సంబంధించిన మొత్తం 27 పనులపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ, జిల్లాలో వివిధ దశల్లో కొనసాగుతున్న రోడ్డు ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలు పూర్తయితే రాకపోకలు సులభతరం అవడమే కాకుండా ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు. నిర్మాణ పనుల సమయంలో ప్రజల సౌకర్యార్థం తాత్కాలిక ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నామని, వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. నిర్ణీత కాలవ్యవధిలో పనులు పూర్తయ్యేలా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.


రోడ్డు ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం ద్వారా రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని, జిల్లా అభివృద్ధిలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని కలెక్టరు పేర్కొన్నారు. ఏలూరులోని పవర్‌పేట గేటు, దెందులూరు మండలంలోని సీతంపేట, శ్రీరామవరం, భీమడోలు రైల్వే గేటు, పూళ్ల, కైకరం, చేబ్రోలు, ఉంగుటూరు స్టేషన్ వద్ద ప్రతిపాదిత రైల్వే ఓవర్/అండర్ బ్రిడ్జిల భూసేకరణ పనులు నిర్ణీత సమయంలో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణలో ఎటువంటి అభ్యంతరాలు, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా లక్ష్యాలను సాధించాలని తెలిపారు.

ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) మాట్లాడుతూ, పవర్‌పేట రైల్వే స్టేషన్ గేటు వద్ద ఫ్లైఓవర్ లేదా అండర్‌పాస్ ఏది అనుకూలమో సర్వే చేసి ప్రభుత్వానికి నివేదించి మంజూరు కోసం కృషి చేయాలని సూచించారు. ఏలూరు నియోజకవర్గంలో మిగిలి ఉన్న ఆర్వోబి, ఆర్‌యుబి పనులు వేగవంతం చేయడానికి అధికారులు సమిష్టిగా పనిచేయాలని కోరారు.

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, కొత్తగూడెం బ్రిడ్జి మంజూరు కావడం సంతోషకరమని తెలిపారు. జాతీయ రహదారిలో కొన్ని చోట్ల వెడల్పు చేయకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, ఆశ్రమం కాలేజీ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జిని విస్తరించాలని కోరారు. వట్లూరు వద్ద నిర్మించిన బ్రిడ్జి బాగుందని, అయితే రెండు వైపులా రహదారులు వేయాలని సూచించారు. దెందులూరు నియోజకవర్గంలో మిగిలిన పనులనూ వేగంగా పూర్తి చేయడానికి జిల్లా యంత్రాంగం మరింత చొరవ చూపాలని కోరారు.

ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టరు ఎం.జె. అభిషేక్ గౌడ, జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, ఆర్డీవో ఎం. అచ్యుత అంబరీష్, ఆర్&బి ఈఈ వై.వి. కిషోర్, రైల్వే అధికారులు యస్.వి.వి. సత్యప్రసాదు, టి. ప్రసాదరావు, గతి శక్తి ఎస్‌ఎస్‌ఈ వర్క్స్ శ్రీనివాస్‌తో పాటు తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, మండల సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.