తూర్పువీధి గంగానమ్మ జాతర ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్


— భక్తులకు అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలి


దెందులూరు/ఏలూరు: శతాబ్ద కాలానికి పైగా ఏలూరు ప్రజల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న తూర్పువీధి గంగానమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

ఏలూరు తూర్పువీధిలోని జాతర కమిటీ కన్వీనర్ వంకినేని భాను ప్రకాష్ గారి నివాసంలో ఏర్పాటు చేసిన శ్రీ గంగానమ్మ, శ్రీ ఆది మహాలక్ష్మమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ, శ్రీ పోతురాజు బాబుల ఘటాలకు జరిగిన ప్రత్యేక పూజల్లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, సతీసమేతంగా పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, శతాబ్దాలుగా భక్తుల ఆరాధన పొందుతున్న ఏలూరు తూర్పువీధి గంగానమ్మ జాతరను జాతర కమిటీ వారు అత్యంత వైభవంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. అమ్మవార్ల కరుణ కటాక్షాలు దెందులూరు, ఏలూరు నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.

ఈ నెల 25వ తేదీన జరగనున్న మహాకుంభం కార్యక్రమానికి, అలాగే 26వ తేదీన చిత్రవిచిత్ర వేషధారణలతో భారీ భక్తజన సందోహంతో నిర్వహించనున్న కొర్ల బండి ఊరేగింపుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాతర కమిటీ కన్వీనర్లు, వాలంటీర్లు, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు.