తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహాపురుషుడు.


సంక్షేమానికి, సినీరంగానికి కొత్తబాటలు వేసిన సంఘసంస్కర్త సర్గీయ నందమూరి తారక రామారావు జీవితం స్ఫూర్తిధాయకం.

రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ... 

ఏలూరు జిల్లా, ఏలూరు/నూజివీడు: నూజివీడు పట్టణంలో ఆదివారం హనుమాన్ జంక్షను రోడ్డులోని పోతిరెడ్డిపల్లి రోడ్డు టర్నింగు వద్దఉన్న ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహానికి, న్యూ ఎంప్లాయిస్ కాలనీ విగ్రహానికి రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 

అనంతరం రెడ్ క్రాస్ సంస్థ ద్వారా నిర్వహించిన బ్లడ్ క్యాంపులో పాల్గొని రక్తదాతలను అభినందించి, పండ్లను అందించారు. నూజివీడు పట్టణం గవర్నమెంటు ఏరియా హాస్పిటల్‌లో పేషంట్లకు పండ్లును పంపిణీ చేశారు. లైన్ తండా గ్రామంలో దుప్పట్లు పంపిణీ చేశారు.

ఈ సంధర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ యన్టీఆర్‌ మనకు దూరమై 30 ఏళ్ళు అయ్యిందని అయినా కూడా ఎవ్వరూ మర్చిపోలేని మహామనిషి అన్నారు. ఆయన అసాధారణ జీవితం దూరదృష్టితో కూడిన ఆయన నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్‌ పై తిరుగులేని చెరగనిముద్ర వేశారన్నారు. 

అన్ని వర్గాలు ప్రజలకు ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు అని, ఈ రోజు అందరూ యన్టీఆర్ ను స్మరించు కుంటారన్నారు. భారతదేశ రాజకీయాలలో చెరగని శాశ్వత ముద్రవేశారని, తమిళనాడులో యంజిఆర్, ఆంధ్రప్రదేశ్ లో యన్టీఆర్ రాజకీయాలలో కొత్త బాటలు వేసి బడుగు, బలహీన వర్గాలు సంక్షేమానికి, అభివృద్ధికి తనదైన ముద్ర వేశారని అన్నారు. 

బడుగు, బలహీన వర్గాలు ఇబ్బందులు తొలగించేందుకు కరణాలు వ్యవస్థను రద్దుచేసి విఆర్వో వ్యవస్థ తీసుకువచ్చారని అన్నారు. మండలాలు, మండల ప్రజా పరిషత్తు, జిల్లా ప్రజా పరిషత్తులు ద్వారా సంక్షేమం, అభివృద్ధి ప్రజల చెంతకు తీసుకువచ్చి, ప్రజలు మెచ్చుకునే స్థాయిలో సేవలు అందించారన్నారు. కిలో రూ 2 బియ్యం, నిరుపేదలకు ఇంటి నిర్మాణాలు, అతి చౌకగా జనతా వస్త్రాలు, పింఛన్లు, పేదవాడికి కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో నిరుపేద వర్గాలు ప్రజలకు మంచి లబ్ధిని చేకూర్చారన్నారు. 


రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మహిళలు అభివృద్ధి చెందాలని  మహిళలకు రిజర్వేషన్లు కల్పించి రాజకీయాలు, విద్య, ఉపాధి, ఉద్యోగ, స్థానిక సంస్థలు, చట్టసభలల్లో  సముచిత స్థానాలు కల్పించారని అన్నారు. మహిళలకు ప్రత్యేకంగా తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ స్థాపించి మహిళలు విద్యకు పెద్దపీట వేశారని అన్నారు. మహిళలకు ఆస్తిలో 50 శాతం వాటా ఇవ్వాలని చట్టం చేసి పగడ్బందీగా అమలు చేశారని అన్నారు. 

ఎన్టీఆర్ రైతు కుటుంబంలో జన్మించి అంచెల అంచెలుగా ఎదిగిన వ్యక్తి అన్నారు.  ప్రతి ఒక్కరూ  ఎన్టీఆర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని  అన్నారు. తెలుగు ప్రజలు హృదయాలలో ఎన్టీఆర్ స్థిరస్థాయిగా నిలిచి పోయారని తెలిపారు. ఎన్టీఆర్ రాజకీయరంగ ప్రవేశం తరవాతపేద ప్రజలు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రజలలో ధైర్యం నింపారన్నారు. మహా నాయకులను స్పూర్తిగా తీసుకోవాలని  దేశానికి, రాష్ట్రానికి, పుట్టిన గ్రామానికి సేవలు అందించుటకు మంచి స్ఫూర్తి కలుగుతుందని అన్నారు. 

సామాన్యుడి స్వరం రాజకీయాల్లో వినిపించాలనే సంకల్పంతో 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్‌టీఆర్ కేవలం తొమ్మిది నెలల్లోనే ప్రజల ఆశీస్సులతో అధికారాన్ని చేపట్టి భారత రాజకీయ చరిత్రలో అరుదైన ఘనతను సాధించారని తెలిపారు. తెలుగు ప్రజలు ఆత్మగౌరవం, స్వాభిమానం, స్వయంకృషి అనే మూల సూత్రాలతో రాజకీయాల్లోకి వచ్చి వ్యవస్థలో మార్పుకు నాంది పలికారని అన్నారు. 

అధికార వికేంద్రీకరణ, గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమం, పేదలు సంక్షేమమే లక్ష్యంగా అనేక ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేశారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రజలు విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రజలు మధ్యేనిలిచి ప్రజాస్వామ్య విలువలు పరిరక్షణ కోసం పోరాడిన ధీరనాయకుడు ఎన్‌టీఆర్ అన్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం నేటి తరానికి, రాబోయే తరానికి  ఆదర్శప్రాయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ హాస్పిటల్ వైద్యాధికారులు, ప్రజా ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, కూటమి నాయకులు, యన్టీఆర్ అభిమానులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, గిరిజన నాయకులు, తండా ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.