నేవీ ఆయుధ డిపో పేరుతో రైతుల భూములు బలవంతంగా లాక్కుంటే చూస్తూ ఊరుకోం..

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు..


ఏలూరు జిల్లా, కొయ్యలగూడెం: నేవీ ఆయుధ డిపో పేరుతో రైతుల భూములు బలవంతంగా లాక్కుంటే చూస్తూ ఊరుకోబోమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ అన్నారు. శనివారం కొయ్యలగూడెం ప్రజాసంఘాల కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీలుగుమిల్లి మండలం వంకావారిగూడెంలో ఏర్పాటు చేయాలనుకున్న నేవీ ఆయుధ డిపోను అక్కడ ప్రజలు వ్యతిరేకించడంతో కొయ్యలగూడెం మండలం బోడిగూడెం, మంగపతి దేవి పేట గ్రామాల పరిధిలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడాన్ని సంబంధిత గ్రామాల రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. 

ఇప్పటికే ఈ గ్రామాల పరిధి రైతులు ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారని, ఆందోళనలు చేపట్టారని గుర్తు చేశారు. తమ భూములు కోల్పోయి రోడ్డున పడతామని రైతులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. ప్రభుత్వ భూములు ఉండగా రైతుల భూములను బలవంతంగా లాక్కోవాలని ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని విమర్శించారు. రైతులు చేస్తున్న పోరాటానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తున్నట్లు చెప్పారు. రైతుల భూములను బలవంతంగా లాక్కుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, సిఐటియు జిల్లా నాయకులు శుక్ల బోయిన రాంబాబు తదితరులు పాల్గొన్నారు.