గిరిజనాభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు – జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి


ఏలూరు, జనవరి 31, 2026:
గిరిజన ప్రాంతాలలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశ మందిరంలో శనివారం సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటిడిఏ) పరిధిలో అమలవుతున్న కార్యక్రమాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనుల సామాజిక, ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి జన్‌మన్ యోజన, ధర్తి ఆబా జనభాగిదారి అభియాన్ వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నాయన్నారు. ఈ పథకాల ద్వారా మారుమూల గిరిజన ప్రాంతాల్లో గృహాలు, త్రాగునీరు, రహదారులు, విద్యుత్, విద్య, ఆరోగ్య సదుపాయాలు కల్పించేందుకు నిధులు మంజూరు చేశారని తెలిపారు. మంజూరైన పనులను మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేసి, నిధులను పూర్తిస్థాయిలో వినియోగించాలన్నారు.

పంచాయతీ రాజ్ శాఖ ద్వారా మంజూరైన 12 రోడ్లకు సంబంధించిన 56 పనులను వెంటనే పూర్తి చేయాలని, రహదారులు, ఆర్‌డబ్ల్యూఎస్ పనులకు సంబంధించి అటవీ శాఖ అనుమతులు తక్షణమే పొందాలని ఆదేశించారు. గృహ నిర్మాణాల కోసం స్వయం సహాయక సంఘ సభ్యులకు అదనపు రుణాలు అందించి, నిర్దేశిత కాలంలో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.

గ్రామీణ నీటి సరఫరా పథకం కింద 86 పనులు మంజూరుకాగా, 78 పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లోని 86 గ్రామాల్లో 81 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించామని, మిగిలిన 5 గ్రామాల్లో పనులు వెంటనే పూర్తిచేయాలన్నారు. మొబైల్ టవర్ల ఏర్పాటును కూడా ఫిబ్రవరి నెలలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలలు, వసతి గృహాలకు త్రాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలపై రెండు రోజుల్లో ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. అన్ని గిరిజన పాఠశాలలు, వసతి గృహాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, అవి సక్రమంగా పనిచేసేలా చూడాలన్నారు. గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి, జాబ్ మేళాలు నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.


ఐటిడిఏ నిధుల వినియోగంపై సమగ్ర విచారణ – కలెక్టర్ హెచ్చరిక

జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా ఐటిడిఏ నిధులు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఐటిడిఏలో అకౌంట్స్ అధికారి బదిలీ అయ్యి మూడు నెలలు గడిచినా కొత్తగా నియామకం జరగకపోవడం, నిధుల వినియోగంపై సరైన పర్యవేక్షణ లేకపోవడంపై ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి రాములు నాయక్‌పై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఐటిడిఏ నిధులను కలెక్టర్ అనుమతితోనే ఖర్చు చేయాలని, నిధుల వినియోగంపై సమగ్ర విచారణ చేపడతామని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పనుల పర్యవేక్షణలో విఫలమైనందుకు ఐటిడిఏ పీఓ పనితీరు మెరుగుపరచుకోవాలని ఆదేశించారు.


గిరిజనులకు అందుతున్న వైద్య సేవలపై కలెక్టర్ అసంతృప్తి

గిరిజన ప్రాంతాల్లో గత 9 నెలల్లో 281 మంది మహిళలకు గర్భస్రావాలు జరగడం, 319 పుట్టిన పిల్లల నమోదు కాకపోవడం, ఎన్‌సీడీ సర్వే, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులు, రక్తహీనత సమస్యలు, ఇమ్మ్యూనైజేషన్ వివరాలపై సరైన సమాచారం అందించని ఐటిడిఏ డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. సురేష్ కుమార్ పనితీరుపై సమగ్ర విచారణ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ డా. పి.జె. అమృతాన్ని కలెక్టర్ ఆదేశించారు. 281 గర్భస్రావాలపై కేసు వారీగా వివరాలు సమర్పించాలని సూచించారు.

బాల్య వివాహాల కారణంగా గర్భస్రావాలు జరుగుతున్నాయని ఐటిడిఏ పీఓ పేర్కొనడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాల్య వివాహాలను అరికట్టాల్సిన బాధ్యత అధికారులదేనని, కేవలం సమాచారం ఇవ్వడం బాధ్యతారాహిత్యమని వ్యాఖ్యానించారు.


సమీక్ష సమావేశంలో పాల్గొన్న అధికారులు

ఈ సమావేశంలో
డీఎంహెచ్ఓ డా. పి.జె. అమృతం, ట్రాన్స్‌కో ఎస్‌ఈ సాల్మన్ రాజు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ త్రినాధ్ బాబు, ఐసిడిఎస్ పీడీ శారద, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, డీఆర్‌డీఏ పీడీ విజయలక్ష్మి, పంచాయతీ రాజ్ ఎస్‌ఈ, ఐటిడిఏ పరిధిలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.