సీతారాంపురం ఎంపీపీ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈదర కాంప్లెక్స్ చైర్మన్ శారద, గ్రామ సర్పంచ్ అత్తి మురళీమోహన్, ఆగిరిపల్లి మండలం ఎంఈఓ–2 ఆనంద్ కుమార్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి శారద అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా చదువులో ప్రతిభ కనబరిచి మిక్స్‌లో ఫస్ట్, సెకండ్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఆమె మేమెంటోలు అందజేశారు. అలాగే ఈ సంవత్సరం స్పెల్‌బీ జోనల్ స్థాయికి ఎంపికైన విద్యార్థి ఎస్. కార్తీక్‌ను గ్రామ సర్పంచ్ అత్తి మురళీమోహన్, ఎస్‌ఎంసీ చైర్మన్ అభినందించి మేమెంటోలు ప్రదానం చేశారు.
కార్యక్రమంలో విద్యార్థులు ఆటపాటలు, నృత్య ప్రదర్శనలతో అందరినీ అలరించారు. పాఠశాల ప్రాంగణం అంతా ఉత్సాహభరిత వాతావరణంతో నిండిపోయింది.
ఈ సందర్భంగా ఎంఈఓ–2 ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు అన్ని సదుపాయాలతో, అర్హత కలిగిన ఉపాధ్యాయులతో ప్రైవేట్ పాఠశాలలకు పోటీగా ఉన్నాయని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే, ఎన్రోల్మెంట్ పెరిగి మరిన్ని పోస్టులు మంజూరయ్యే అవకాశం ఉంటుందన్నారు.
కాంప్లెక్స్ చైర్మన్ శారద మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరుకావాలని, పాఠాలను శ్రద్ధగా నేర్చుకొని లక్ష్యాలను సాధించాలని సూచించారు. విద్యతో పాటు నైతిక విలువలను అలవర్చుకోవాలని, నిరంతరంగా చదువులో ముందుకు సాగితే తప్పక విజయం సాధిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయిని సిహెచ్. కృపావతి అధ్యక్షతన, ఉపాధ్యాయులు యు. హేమలత, పివిడి రాజేష్ సహకారంతో విజయవంతంగా ముగిసింది. కార్యక్రమానికి హాజరైన తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, దాతలకు పాఠశాల యాజమాన్యం ధన్యవాదాలు తెలిపింది.















Social Plugin