ఏలూరు జిల్లాలో పులి సంచారం— ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా అటవీ శాఖాధికారి సందీప్ రెడ్డి


ఏలూరు/జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లాలో పులి సంచారం నమోదైనట్లు జిల్లా అటవీ శాఖాధికారి సందీప్ రెడ్డి తెలిపారు. బుధవారం తెలంగాణ రాష్ట్రం కావడిగుండ్ల అటవీ ప్రాంతం నుంచి ఏలూరు జిల్లాలోకి పులి ప్రవేశించినట్లు పగ్‌మార్క్స్ ఆధారంగా గుర్తించినట్లు ఆయన వెల్లడించారు.


గురువారం తన కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడిన సందీప్ రెడ్డి, బుధవారం పులి కావడిగుండ్ల అటవీ ప్రాంతంలో సంచరించి అక్కడ ఒక ఆవును చంపిందని తెలిపారు. అనంతరం జంగారెడ్డిగూడెం రేంజ్ పరిధిలోని ములగలంపల్లి సెక్షన్, అంతర్వేదిగూడెం బీట్ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు పగ్‌మార్క్స్ ద్వారా నిర్ధారించామని చెప్పారు. గురువారం తెల్లవారుజామున అంతర్వేదిగూడెం గ్రామంలో ఒక ఆవును, నాగులగూడెం గ్రామ శివారులో ఒక ఆవును మరియు ఒక ఆవుదూడను పులి దాడి చేసి చంపినట్లు తెలిపారు.

తదుపరి ములగలంపల్లి సెక్షన్, ములగలంపల్లి బీట్ బెడదనూరు రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు పగ్‌మార్క్స్ ద్వారా గుర్తించామని ఆయన పేర్కొన్నారు. పులి కదలికలను గమనించేందుకు అటవీ శాఖ సిబ్బందితో డే & నైట్ బృందాలను ఏర్పాటు చేశామని, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల రెవెన్యూ, పోలీస్ శాఖల సహకారంతో చర్యలు చేపట్టామని వివరించారు.

బెడదనూరు రిజర్వ్ ఫారెస్ట్‌కు సమీపంలోని టెడదనూరు, పాకలగూడెం, అంకన్నగూడెం తదితర గ్రామాల ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. పులి సంచరిస్తున్న ప్రాంతాలకు ప్రజలు ఒంటరిగా వెళ్లకూడదని, ఆవులు, గేదెలు, మేకలను అటవీ ప్రాంతాలకు తోలుకొని వెళ్లరాదని సూచించామని చెప్పారు. రాత్రి సమయంలో పశువుల పాకల వద్ద ఎక్కువ వెలుతురు వచ్చేలా దీపాలు ఏర్పాటు చేయాలని, అవసరం లేకుండా బయట తిరగరాదని ప్రజలకు సూచనలు ఇచ్చినట్లు తెలిపారు.

పులి కదలికలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి సమాచారం లేదా ఆనవాళ్లు కనిపించినా వెంటనే అటవీ శాఖకు తెలియజేయాలని అటవీ శాఖ మైకు, టాంటాం ద్వారా ప్రచారం నిర్వహిస్తోందని సందీప్ రెడ్డి చెప్పారు. పులిని ఉద్దేశపూర్వకంగా గాయపరచడం లేదా చంపడం వంటి చర్యలు వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972 ప్రకారం శిక్షార్హమని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అవాస్తవ వార్తలను నమ్మవద్దని ప్రజలను కోరారు.

పులి కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు ఎన్‌టీపీసీ (NTCA) న్యూఢిల్లీ సూచనల మేరకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

సమాచారం కోసం సంప్రదించవలసిన నంబర్లు:

1. సబ్ డివిజనల్ అటవీ అధికారి, జంగారెడ్డిగూడెం – 9505499141
2. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, జంగారెడ్డిగూడెం – 9440810223
3. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ములగలంపల్లి – 9550902333
4. కంట్రోల్ రూమ్, ఏలూరు – 9908880327