![]() |
| మంత్రి కొలుసు పార్థసారథి |
— నూజివీడు నియోజకవర్గంలో విద్యారంగానికి మైలురాయి: మంత్రి కొలుసు పార్థసారథి
ఏలూరు/నూజివీడు: మాజీ పార్లమెంటు సభ్యులు సర్గీయ కొలుసు పెద్ద రెడ్డయ్య పేరుతో ఏర్పాటు చేసిన చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలకు “నారా లోకేష్ విద్యాఅమృతం” పేరిట రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శ్రీకారం చుట్టారు. నూజివీడు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రారంభించిన ఈ కార్యక్రమం విద్యారంగంలో ఒక కీలక ముందడుగుగా నిలవనుందని ఆయన అన్నారు.
ఆగిరిపల్లి మండలంలోని ఆగిరిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత నెల ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు అవసరమైన విద్యాఅమృతం సరుకులను గత నెల 26 నుంచే అన్ని మండలాల పాఠశాలలకు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. సర్గీయ కొలుసు పెద్ద రెడ్డయ్య చారిటబుల్ ట్రస్టు ద్వారా ఈ సేవా కార్యక్రమం అమలవుతోందన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొస్తున్నారని అన్నారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన పీ–4 కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. అదే స్ఫూర్తితో తన వంతుగా ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో విద్యాఅమృతం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వివరించారు.
![]() |
| మంత్రి కొలుసు పార్థసారథి |
తన తండ్రి సర్గీయ కొలుసు పెద్ద రెడ్డయ్య నిరుపేద కుటుంబ నేపథ్యంతో ఎదిగారని, ఆర్థిక ఇబ్బందుల మధ్యనే విద్యాభ్యాసం సాగించారని గుర్తు చేసుకున్నారు. ఏ ఒక్క పేద విద్యార్థి ఆర్థిక కారణాల వల్ల చదువుకు దూరం కాకూడదని, పౌష్టికాహారం లోపంతో అనారోగ్యానికి గురికాకూడదనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించాలని కోరారు.
నూజివీడు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, చదువుపై ఏకాగ్రత పెంపొందించి ఉత్తమ ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాలు మరియు నూజివీడు పట్టణ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలకు పౌష్టిక అల్పాహారం అందిస్తున్నామని చెప్పారు.
నియోజకవర్గంలో మొత్తం 32 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 1,836 మంది విద్యార్థులు ఉన్నారని, పబ్లిక్ పరీక్షలు పూర్తయ్యే వరకు 100 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని మంత్రి వివరించారు. ఈ విద్యాఅమృతం కార్యక్రమానికి వారానికి సుమారు రూ.1.5 లక్షల ఖర్చుతో, మొత్తం 100 రోజులకు దాదాపు రూ.20 లక్షలు వ్యయమవుతాయని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు పోషకాహార లోపం లేకుండా చదువుపై పూర్తి దృష్టి సారించి ఉత్తమ ఫలితాలు సాధించాలనే సంకల్పంతో చేపట్టిన “నారా లోకేష్ విద్యాఅమృతం” కార్యక్రమం నూజివీడు నియోజకవర్గంలో విద్యారంగానికి ఒక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని చదువులో రాణించి తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
















Social Plugin