అంబటి రాంబాబును వెంటనే అరెస్టు చేయాలి- జిల్లా టీడీపీ అధ్యక్షులు బడేటి చంటి డిమాండ్


ఏలూరు, జనవరి 31:

వైసీపీ పార్టీ అంటేనే బూతుల పార్టీ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి నిరూపించారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తీవ్రంగా విమర్శించారు. పరిపాలనా దక్షుడు, 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని, ఆయన తల్లిని ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత అంబటి రాంబాబును తక్షణమే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

శనివారం ఏలూరులో విడుదల చేసిన ఒక ప్రకటనలో బడేటి చంటి మాట్లాడుతూ అంబటి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విమర్శలు సహజమే అయినా, అవి శృతి మించితే కఠినమైన శిక్షలు తప్పవని అంబటి వంటి వ్యక్తులకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి బూతులు మాట్లాడే నేతపై చట్టపరమైన చర్యలు తీసుకుంటేనే మిగతా నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడతారని తెలిపారు.

తన పాలనతో దేశ, విదేశాల ప్రముఖ నాయకుల ప్రశంసలు పొందిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి అంబటి చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆయన మండిపడ్డారు. బూతులు తిట్టడమే గొప్పగా భావించడం వైసీపీ పార్టీ సంస్కృతిగా మారిపోయిందని విమర్శించారు.

ఇటువంటి వ్యక్తులను, వారి వెనుక ఉండి నడిపిస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేష్టలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే వారికి మరో గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బడేటి చంటి హెచ్చరించారు.