దళితుల చరిత్ర, మూలాలను యువతకు తెలియజేయాల్సిన అవసరం – నేతల పిలుపు
ఏలూరు జిల్లా:
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంత్ గురు రవిదాస్ గారి 649వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి దళితవాడలో సంత్ గురు రవిదాస్ జయంతి వేడుకలు నిర్వహించి, దళితుల మూలాలు, చరిత్రను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ నేతలు పేర్కొన్నారు.
సంత్ గురు రవిదాస్ గారు 14వ శతాబ్దానికి చెందిన మహానుభావుడని, దళిత సామాజిక వర్గానికి చెందిన చేబిలి కులంలో జన్మించిన ఆయన వృత్తి పరంగా చెప్పులు కుట్టేవారని గుర్తు చేశారు. అయినప్పటికీ, కుల వివక్ష, అంటరానితనం వంటి సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా తన జీవితమంతా పోరాడిన గొప్ప సమాజ సంస్కర్తగా ఆయన చరిత్రలో నిలిచారని తెలిపారు.
సంత్ గురు రవిదాస్ గారు అన్యాయానికి తలవంచకూడదని, మానవాళిని ఏకం చేయాలని తన బోధనల ద్వారా సమాజానికి సందేశమిచ్చారని, ఆయన పోరాటం, త్యాగం నేటికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని అన్నారు. ఆయన రచనలు, కవిత్వాలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలపై ఘాడమైన ప్రభావం చూపాయని, ముఖ్యంగా కుల వ్యవస్థ వ్యతిరేక పోరాటంలో రవిదాస్ గారి మానవత్వ సందేశాలు దళిత ఉద్యమాలకు బలమయ్యాయని పేర్కొన్నారు.
రవిదాస్, కబీర్, గౌతమ బుద్ధుల భక్తి మార్గాలు అంబేద్కర్ గారి వరకు కుల వ్యతిరేక దార్శనిక గొలుసుగా మారాయని, అదే స్ఫూర్తితో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రచించారని నేతలు అభిప్రాయపడ్డారు.
భారతీయ జనతా పార్టీతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ దళిత జాతి రత్నాలను ఈ తరం వారికి పరిచయం చేస్తూ, వారు మరచిపోయే వ్యక్తులు కాదని, ముందు తరాలు గర్వంగా గుర్తుంచుకోవాల్సిన మహానుభావులని చాటి చెబుతున్నారని తెలిపారు. దళితుల అభివృద్ధి, గౌరవం కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తి న్యాయం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
గౌతమ బుద్ధుడు, సంత్ గురు రవిదాస్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లాంటి మహానుభావులను ఆదర్శంగా తీసుకొని ప్రతి దళితుడు తన హక్కుల కోసం పోరాడుతూ ముందుకు సాగాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారని నేతలు ఈ సందర్భంగా గుర్తు చేశారు.















Social Plugin