నూతన సంవత్సరం సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం


ఏలూరు జిల్లా, ఏలూరు: 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఏలూరు నగరంలోని 28వ డివిజన్ తంగేళ్లమూడి–2 సచివాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం జరిగింది. డివిజన్ కార్పొరేటర్ తంగిరాల అరుణ సురేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొని కార్మికులను అభినందించారు.


ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు, నిత్యావసర కిరాణా సరుకులు పంపిణీ చేశారు. డివిజన్‌లో ప్రతిరోజూ ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేయడం, డ్రైనేజీల శుభ్రత, రోడ్ల శుభ్రపరిచే పనులు, మృత జంతువుల తొలగింపు వంటి కష్టమైన పనులను నిస్వార్థంగా నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివని కార్పొరేటర్ తెలిపారు.

ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్న ఆయన, వారి కృషికి కృతజ్ఞతగా నూతన సంవత్సరం రోజున ఈ సన్మానం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు.