మెరుగైన ప్రజాసేవలే లక్ష్యంగా 2026కు స్వాగతం


నూతన సంవత్సర వేడుకల్లో ఐజి జి.వి.జి. అశోక్‌కుమార్, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వెల్లడి


ఏలూరు జిల్లా, ఏలూరు: మెరుగైన, వేగవంతమైన ప్రజాసేవల లక్ష్యంతో 2026 సంవత్సరంలోకి అడుగుపెడుతున్నామని ఏలూరు రేంజ్ ఐజి శ్రీ జి.వి.జి. అశోక్ కుమార్ ఐపీఎస్, జిల్లా ఎస్పీ శ్రీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ తెలిపారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఏలూరు రేంజ్, జిల్లా పోలీస్ యంత్రాంగం అత్యంత ఉత్సాహంగా వేడుకలు నిర్వహించింది.

ఏలూరు రేంజ్ ఐజి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఐజి అశోక్ కుమార్ కేక్ కట్ చేసి పోలీస్ సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2025లో పోలీస్ శాఖ సాధించిన విజయాలు ప్రశంసనీయమని పేర్కొంటూ, 2026లో సాంకేతికతను మరింతగా వినియోగించి నేర నియంత్రణలో వినూత్న మార్పులు తీసుకువస్తామని తెలిపారు. రేంజ్ పరిధిలోని ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.

అదే విధంగా ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ తన క్యాంప్ కార్యాలయ సిబ్బందితో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. 2025లో ప్రజల సహకారంతో అనేక సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, 2026లో పోలీస్ సేవలను మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. జిల్లా పోలీస్ కుటుంబ సభ్యులకు, జిల్లా ప్రజలకు ఎస్పీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.


2026 సంవత్సరానికి పోలీస్ శాఖ ప్రధాన ప్రాధాన్యతలుగా ప్రజా పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయడం, మహిళలు మరియు చిన్నారుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వడం, సైబర్ నేరాల నియంత్రణతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టడం ఉంటాయని ఉన్నతాధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐజి జి.వి.జి. అశోక్ కుమార్‌కు పూల మొక్కను అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలు పోలీస్ సిబ్బందిలో కొత్త ఉత్సాహాన్ని నింపగా, ప్రజల భద్రత కోసం నిరంతరం శ్రమించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు పునరుద్ఘాటించారు.