ఏలూరు జిల్లా, ఏలూరు: ఏలూరు పోలీసుల అప్రమత్తత, నిజాయితీ మరోసారి వెలుగులోకి వచ్చింది. పోగొట్టుకున్న నగదు, విలువైన పత్రాలతో కూడిన పర్సును గుర్తించి, బాధితుడికి సురక్షితంగా అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు ఏలూరు టూ టౌన్ బ్లూ కోల్ట్స్ సిబ్బంది.
హైదరాబాద్‌కు చెందిన ఎర్రమిల్లి ఉదయ్ శర్మ తన కుమార్తెను కలుసుకునేందుకు ఏలూరు నగరంలోని ఎస్ఎంఆర్ నగర్‌కు వచ్చారు. ఈ క్రమంలో రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఆయన తన పర్సును పోగొట్టుకున్నారు. పర్సులో నగదు, ఆధార్ కార్డు, ఏటీఎం కార్డు వంటి ముఖ్యమైన పత్రాలు ఉండటంతో ఆయన తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఈ సమయంలో ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న బ్లూ కోల్ట్స్ సిబ్బంది పీసీ 2323 ఎన్.శ్రీనివాస్, పీసీ 2497 ఈ.సతీష్ గస్తీలో ఉండగా రోడ్డుపై ఒక పర్సు లభ్యమైంది. పర్సును పరిశీలించగా అందులో రూ.8,700 నగదు, ఏటీఎం కార్డు, ఆధార్ కార్డు ఉన్నట్లు గుర్తించారు.
ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బ్లూ కోల్ట్స్ సిబ్బంది ఆ పర్సును టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఆధార్ కార్డు ఆధారంగా బాధితుడు ఎర్రమిల్లి ఉదయ్ శర్మ వివరాలను సేకరించిన పోలీసులు వెంటనే ఆయనకు సమాచారం అందించారు.
బాధితుడు పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా, టూ టౌన్ సీఐ కె. అశోక్ కుమార్ నగదు, పర్సును ఆయనకు అందజేశారు. తన పర్సు తిరిగి దొరుకుతుందనే ఆశ వదులుకున్న సమయంలో పోలీసులు స్వయంగా సంప్రదించి అప్పగించడంపై ఉదయ్ శర్మ హర్షం వ్యక్తం చేస్తూ ఏలూరు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
నిజాయితీతో విధులు నిర్వహించిన బ్లూ కోల్ట్స్ సిబ్బంది పీసీలు శ్రీనివాస్, సతీష్‌లను టూ టౌన్ సీఐ అశోక్ కుమార్, ఎస్ఐ మధు వెంకట రాజా అభినందించారు. ఈ ఘటన పోలీసులపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంచిందని స్థానికులు ప్రశంసించారు.

.jpeg)














Social Plugin