ఏలూరు కలెక్టరేట్ ముందు కోకో రైతుల ధర్నా..


కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర చెల్లించాలి..
కోకో గింజలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రైస్ పాలసీ ప్రకటించాలి..
రాష్ట్ర కోకో బోర్డు, కేంద్ర కోకో పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలి..


ఏలూరు జిల్లా, ఏలూరు: కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర చెల్లించాలని, ప్రైస్ పాలసీ ప్రకటించాలని, రాష్ట్ర కోకో బోర్డు ఏర్పాటు చేయాలని, కేంద్ర కోకో పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో  సోమవారం ఏలూరు కలెక్టరేట్ ముందు కోకో రైతులు ధర్నా నిర్వహించారు. కోకో రైతులు సామూహిక రాయబార కార్యక్రమం చేపట్టి కలెక్టరేట్ లో పిజిఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారికి వినతి పత్రాలు అందజేశారు.

ధర్నా సందర్భంగా  ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎస్.గోపాలకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు బొల్లు రామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పర్వతనేని సుబ్రహ్మణ్యేశ్వర రావు, పానుగంటి అచ్యుతరామయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి గుదిబండి వీరారెడ్డి మాట్లాడారు.

కోకో గింజలు కొనుగోలు సీజన్ ప్రారంభమైందని, రైతులకు అంతర్జాతీయ మార్కెట్ ధర కంపెనీలు ఇవ్వడం లేదని చెప్పారు. కోకో గింజలకు ప్రైస్ పాలసీ లేకపోవడం వలన కంపెనీల ఇష్టా రాజ్యంగా ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్ ధరలు రైతులకు వచ్చేలా ఫార్ములా రూపొందించి ధర ప్రకటిస్తామని గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని ప్రస్తుత సీజన్ కు అమలు చేయాల్సిఉందన్నారు. ఇంతవరకు ఫార్ములా ప్రకటించకపోవడం వలన కంపెనీలు పాత పద్ధతుల్లోనే సిండికేట్ గా మారి కోకో రైతులను మోసగించే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

అంతర్జాతీయ మార్కెట్లో కిలో కోకో గింజలకు రూ.550లకు పైగా ధర ఉంటే  ప్రస్తుతం కంపెనీలు రూ.400లకు కొనుగోలు చేస్తున్నాయని చెప్పారు. ప్రపంచంలో అత్యధికంగా కోకో గింజలు ఉత్పత్తి చేసే ఘనా, ఐవరీ కోస్ట్ వంటి ఆఫ్రికా దేశాలలో ప్రస్తుతం కోకో పంటకు అన్ సీజన్ అని ఆధారలనే అంతర్జాతీయ మార్కెట్లో చూపిస్తున్నారని, వారికి సీజన్ కాలంలో వచ్చిన రేట్లను ఇక్కడ అమలు చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కోకో గింజలకు ప్రైస్ పాలసీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. 

విదేశీ కోకో గింజలపైన, కోకో ఉత్పత్తుల పైన దిగుమతి సుంకాలు తక్కువగా ఉండటం వలన ఇబ్బడిముబ్బడిగా విదేశీ దిగుమతులు వలన దేశీయంగా రైతులు నష్టపోతున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విదేశీ కోకో గింజలు, కోకో ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు పెంచాలని కోరారు. రాష్ట్ర కోకోబోర్డును, కేంద్ర కోకో పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వాలు స్పందించకపోతే కోకో రైతులను సమీకరించి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం నాయకులు పానుగంటి సుధాకర్, పి.నరేష్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కోన శ్రీనివాసరావు, జిల్లా సహాయ కార్యదర్శి సిరిబత్తుల సీతారామయ్య పలువురు కోకో రైతులు పాల్గొన్నారు.