ప్రజా ఉద్యమాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ చర్యలు ఆపాలి.


అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు ఎం.అప్పలరాజుపై అక్రమంగా పెట్టిన పిడి చట్టాన్ని ఎత్తివేయాలి.
ఇనుమూరు గిరిజన రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి.
ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా



ఏలూరు జిల్లా, ఏలూరు: రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ చర్యలు ఆపాలని, అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు ఎం.అప్పలరాజుపై అక్రమంగా పెట్టిన పిడి చట్టాన్ని ఎత్తివేసి జైలు నుండి విడుదల చేయాలని, బుట్టాయగూడెం మండలం ఇనుమూరు గిరిజన రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ రైతు, వ్యవసాయ కార్మిక, కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో  సోమవారం ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా  నిర్వహించారు. ప్రజా ఉద్యమాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంద చర్యలు ఆపాలంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.రవి, జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్ విడి ప్రసాద్ మాట్లాడారు. అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు ఎం. అప్పలరాజుపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా పి.డి.చట్టం పెట్టి 2025 డిసెంబర్ 24 నుండి విశాఖ సెంట్రల్ జైలు నిర్బంధించిందని చెప్పారు. గంజాయి వ్యాపారులు, మానవ అక్రమ రవాణా చేసే వ్యక్తులు, భూ కబ్జాదారులు, గూండాలు, రౌడీలపై పెట్టాల్సిన పీ.డీ. చట్టాన్ని రైతు నాయకుడు ఎం. అప్పలరాజు పై ప్రయోగించి జైల్లో నిర్బంధించటం రాష్ట్ర ప్రభుత్వ నియంతృత్వ చర్యకు నిదర్శమని విమర్శించారు. 

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న బల్బ్ డ్రగ్స్ వల్ల సముద్ర తీర ప్రాంతం కాలుష్య కారకంగా మారుతుందని, మత్స్య సంపద దెబ్బతింటుందని,మత్స్యకారులు ఉపాధి కోల్పోతారని అన్నారు. ప్రజలు, రైతుల ఆమోదం లేకుండా వ్యవసాయ భూములను పరిశ్రమల నిర్మాణానికి తీసుకోకూడదని 2013 భూసేకరణ చట్టం చెపుతున్నదని గుర్తు చేశారు.చట్ట విరుద్ధంగా మిట్టల్ స్టీల్ పరిశ్రమ కొరకు, నిస్సాన్ స్టీల్ కొరకు వ్యవసాయ యోగ్యమైన రైతుల భూములను బలవంతంగా తీసుకోవడాన్ని రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు వ్యతిరేకిస్తున్నారన్నారు. 

వారికి అండగా నిలబడి పోరాడుతున్న రైతు నాయకుడు అప్పలరాజుపై ప్రభుత్వం పి.డి. చట్టాన్ని ప్రయోగించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్దతిలో ప్రజల అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించే దిశగా కాకుండా నిరంకుశంగా నిర్బంధాలను ప్రయోగించి ప్రజా ఉద్యమాలను అణిచివేయాలని చూడడం అవివేకమన్నారు. ఇది ఏ మాత్రం సరైనది కాదన్నారు. అప్పలరాజు విషయంలో రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును, చట్టం పరిధిలో శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కును రాష్ట్ర ప్రభుత్వం పీడి చట్టం ప్రయోగించడం ద్వారా కాలరాస్తోందని విమర్శించారు. 

రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరిని మానుకోవాలని కోరారు. అప్పలరాజు పై పెట్టిన పీ.డీ. చట్టాన్ని రద్దు చేయాలని, జైలు నుండి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బుట్టాయిగూడెం మండలం ఇనుమూరు గ్రామంలో  గిరిజన రైతుల సాగులో ఉన్న భూములలో వేసిన మొక్కజొన్న ఇతర పంటలను రెవిన్యూ, పోలీస్ అధికారులు  ధ్వంసం చేయడమే కాకుండా మగ పోలీసులు గిరిజన మహిళలను జాకెట్లు చింపి చేయి పట్టుకుని పక్కకు లాగి వేయడం అత్యంత దుర్మార్గమన్నారు. పైగా ఇనుమూరు గిరిజనులపైనే తప్పుడు కేసు నమోదు చేశారని చెప్పారు.

విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న విశాఖపట్నంలో విద్యార్ధి సంఘాల కార్యకర్తలపై రౌడీ షీట్ ఓపెన్ చేయడం తగదన్నారు. అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు అప్పలరాజు పై పెట్టిన పి. డి. చట్టం, ఏలూరు జిల్లా ఇనుమూరు గిరిజనులపై అక్రమంగా పెట్టిన కేసులు, విద్యార్థులపై పెట్టిన రౌడీషీట్ అన్నింటిని ఎత్తివేయాలని, ప్రజా ఉద్యమాలపై నిర్బంధాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు, జిల్లా నాయకులు కోన శ్రీనివాసరావు, సిరి బత్తుల సీతారామయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు గూడెల్లి వెంకట్రావు, ఎం. జీవరత్నం, శేషపు మహంకాళీ రావు, సిఐటియు నాయకులు పంపన రవికుమార్, మంచెల్ల ఇస్సాకు,జె. గోపి,ఐద్వా జిల్లా కార్యదర్శి ఎ. శ్యామలా రాణి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె.లెనిన్, చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ పిచ్చుక ఆదిశేషు, ఇనుమూరు గిరిజన భూ పోరాట నాయకురాలు సీతమ్మ తదితరులు పాల్గొన్నారు.