డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లోని పచ్చని కోనసీమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ అవసరాలు, అవినీతి దాహంతో సర్వనాశనం చేస్తున్నాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్రంగా ఆరోపించారు. అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కేజీ బేసిన్‌లో జరిగిన పాశర్లపూడి బ్లో అవుట్ ఘటనలో ప్రాణనష్టం, తాజాగా ఇరుసుమండలో జరిగిన మరో బ్లో అవుట్ ఉదంతాలు కోనసీమ ప్రజలను భయాందోళనలకు గురి చేశాయని తెలిపారు. 100 అడుగులకు పైగా ఎగసిపడిన అగ్ని కీలకాలను చూసి ప్రజలు పిల్లలను ఎత్తుకుని పరుగులు పెట్టిన దృశ్యాలు భయంకరమని అన్నారు. ఈ ప్రమాదాల వెనుక అధికారులు, ప్రైవేట్ మాఫియా కలిసి చేస్తున్న అక్రమాలే కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
కేజీ బేసిన్ సంపదలో 12వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్‌కు 50 శాతం వాటా కేటాయించాల్సి ఉన్నప్పటికీ, నేటికీ రాష్ట్రానికి న్యాయం జరగడం లేదని మేడా శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రుల హక్కుల కోసం పార్లమెంట్‌లో గట్టిగా ప్రశ్నించే ప్రజాప్రతినిధులు లేకపోవడం దురదృష్టకరమన్నారు. కోనసీమ నుంచి ఇప్పటివరకు అసెంబ్లీ, పార్లమెంట్‌కు ఎన్నికైన నేతలెవరూ ఈ ప్రాంత హక్కులు, అభివృద్ధి కోసం పోరాడలేదని విమర్శించారు.
కేజీ బేసిన్ త్రవ్వకాల కారణంగా గాలి, నీరు తీవ్రంగా కలుషితమై కోనసీమ ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, ఈ కాలుష్యం కారణంగా మరణాలు కూడా సంభవిస్తున్నాయని అన్నారు. వేల కోట్ల విలువైన గ్యాస్, క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నప్పటికీ, బావులు ఖాళీ అయ్యాయని తప్పుడు నివేదికలు సమర్పిస్తూ నిబంధనలకు విరుద్ధంగా త్రవ్వకాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు.
కేజీ బేసిన్ నుంచి విలువైన సంపదను తరలిస్తున్న సంస్థల ప్రధాన కార్యాలయాలు కోనసీమ ప్రాంతంలో కాకుండా చెన్నైలో ఉండటం విడ్డూరమని, ప్రమాదాల నివారణకు సరైన పర్యవేక్షణ లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. కోనసీమలో ప్రమాదాలు జరిగితే గుజరాత్, ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాలను రప్పించడం అనేక అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు.
ఖలేజా సినిమాలో చూపినట్లుగా ఖనిజ సంపద కోసం గ్రామాలనే ఖాళీ చేయించే కుట్రలు కోనసీమలో జరుగుతున్నాయని, కార్పొరేట్ కంపెనీలు, ప్రైవేట్ మాఫియా లాభాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని మేడా శ్రీనివాస్ మండిపడ్డారు. కోనసీమ నుంచి లక్షల కోట్ల విలువైన సంపద తరలిపోతున్నా, అక్కడి ప్రజలకు కనీస ప్రయోజనాలు కూడా అందడం లేదన్నారు.
కేజీ బేసిన్ సంపదలో ఆంధ్రప్రదేశ్‌కు చట్టబద్ధంగా రావాల్సిన 50 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వం నుంచి వసూలు చేయాలని, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి కుటుంబానికి వంటగ్యాస్ సిలిండర్‌ను రూ.200కే సరఫరా చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మేడా శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
ఈ సమావేశానికి అర్పిసి సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించగా, పార్టీ నాయకులు డీవీఆర్ మూర్తి, సిమ్మా దుర్గారావు, కారుమూరి యుగంధర్, గుడ్ల సాయి దుర్గా ప్రసాద్, బసా సోనియా, మాసా అప్పాయమ్మ, చల్లా సాంబశివరావు, కాకర్ల ప్రసాద్, చల్లా అఖిల్, సుంకర వెంకట భాస్కర రంగారావు, కందివలస రమణ, కూరాకుల నాగమణి తదితరులు పాల్గొన్నారు.















Social Plugin