సాంప్రదాయ క్రీడలతో సంక్రాంతిని ఆనందంగా జరుపుకోవాలి – వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన ఏఎస్పీ సుస్మిత


లూరు జిల్లా,ఏలూరు/లింగపాలెం: సంక్రాంతి పండుగ సందర్భంగా జూద క్రీడల వైపు యువత వెళ్లకుండా, సాంప్రదాయ క్రీడలతో మానసిక ఉల్లాసాన్ని పొందాలని జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత అన్నారు. సోమవారం లింగపాలెం మండలంలో ధర్మాజీగూడెం ఎస్సై వెంకన్న ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్‌ను ఆమె ప్రారంభించారు.


ఈ సందర్భంగా ఏఎస్పీ సుస్మిత మాట్లాడుతూ యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. రానున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కోడిపందాలు, పేకాట వంటి జూద క్రీడల నుంచి యువతను మళ్లించి, క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించేందుకు ధర్మాజీగూడెం పోలీసులు చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు.

యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడా స్ఫూర్తితో పండుగను జరుపుకోవాలని చింతలపూడి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ క్రాంతి కుమార్ అన్నారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కూడా లభిస్తుందని ఆయన తెలిపారు.

ఈ వాలీబాల్ టోర్నమెంట్‌లో లింగపాలెం మండలంలోని పలు గ్రామాల నుంచి యువత జట్లుగా ఏర్పడి ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో లింగపాలెం మాజీ ఎంపీపీ, లింగపాలెం సోసైటీ చైర్మన్ మోరంపూడి మల్లికార్జునరావు, టీడీపీ నాయకులు తాతిన రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.