ఎస్సీ సామాజిక వర్గాల సమగ్ర అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: ఎమ్మెల్యే చిర్రి బాలరాజు


ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి/పోలవరం: ఎస్సీ సామాజిక వర్గాల సమగ్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పష్టం చేశారు. శుక్రవారం బర్రింకలపాడు లోని పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఎస్సీ సామాజిక వర్గాల నాయకులతో ఆయన విస్తృత స్థాయి ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు ఎస్సీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే నేరుగా అడిగి తెలుసుకున్నారు.


ఈ సమావేశంలో దళితవాడలలో మౌలిక వసతుల కొరత, రహదారుల సమస్యలు, తాగునీటి సరఫరా, డ్రైనేజీ, వీధి దీపాలు, గృహ నిర్మాణం, భూమి సంబంధిత అంశాలు, ఉపాధి అవకాశాల లేమి, యువత విద్యా–ఉద్యోగ సమస్యలు, సంక్షేమ పథకాల అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.

నాయకులు ప్రస్తావించిన ప్రతి అంశాన్ని ఎమ్మెల్యే శ్రద్ధగా వినిపించుకుని, ఆయా సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా పటిష్ట చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ సామాజిక వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు. దళితుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.

ప్రభుత్వ పథకాలతో పాటు తన వ్యక్తిగత చొరవతో కూడా నియోజకవర్గంలోని దళితవాడల అభివృద్ధికి అదనంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మరింత బలోపేతం కావాలన్నదే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు.

ఈ సమావేశం ఎస్సీ సామాజిక వర్గాల సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేస్తూ, ప్రజలు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ సామాజిక వర్గాల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.