పోలవరం నియోజకవర్గంలో జనసేనకు పెరుగుతున్న ఆదరణ – వైసీపీ నుంచి జనసేనలోకి సుమారు 100 మంది చేరిక


ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి/పోలవరం: పోలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి ప్రజల ఆదరణ రోజురోజుకీ పెరుగుతోంది. పోలవరం మండలం ఎల్‌ఎన్‌డీ పేట గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు సుమారు వంద మంది శుక్రవారం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు ప్రతి ఒక్కరికి పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.


వైసీపీ పాలనపై అసంతృప్తి, జనసేన పార్టీ సిద్ధాంతాలు, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు తమను ఆకర్షించాయని నూతనంగా చేరిన నాయకులు తెలిపారు. అలాగే పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సేవాభావంతో కూడిన పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి తాము స్వచ్ఛందంగా జనసేన పార్టీలో చేరుతున్నామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ, జనసేన పార్టీ ప్రజల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పని చేస్తున్న పార్టీ అని అన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, బాధ్యతలు ఉంటాయని, పోలవరం నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా పని చేస్తామని తెలిపారు.

ఈ చేరికల కార్యక్రమంలో జనసేన పోలవరం మండల అధ్యక్షులు గుణపర్తి చిన్ని, రాము, సీతతో పాటు పలువురు జనసేన నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.