ఎక్కడా మాస్ కాపీయింగ్ కి జరగకుండా పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు నిర్వహించాలి..


ప్రతీ ఎగ్జామ్  హాలులో సిసి కెమెరాలతో నిఘా
08812230197 ఫోన్ నెంబరుతో కంట్రోల్ రూమ్..
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.. 


ఏలూరు: జిల్లాలో ఈనెల 21వ తేదీ నుండి జరగనున్న ఇంటర్మీడియేట్ పరీక్షలలో ఎటువంటి మాస్ కాపీయింగ్ జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి  అధికారులను ఆదేశించారు. స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం ఇంటర్ పరీక్షల నిర్వహణపై అధికారులతో  కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్  వెట్రిసెల్వి  మాట్లాడుతూ జిల్లాలోని 130  పరీక్షా కేంద్రాల్లో ఈనెల 21వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు పరీక్షలకు 34,615 మంది విద్యార్ధులు హాజరుకానున్నట్లు చెప్పారు. 

పరీక్షా కేంద్రాల హాల్స్ లో సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటుచేయాలన్నారు. పరీక్షా పత్రాలను స్ట్రాంగ్ రూంలలో భద్రపరచాలని,పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్త్ ఏర్పాటుచేయాలన్నారు. పరీక్షా కేంద్రాలలో సెల్ ఫోన్ లను ఎట్టిపరిస్థితులలోనూ అనుమతించవద్దన్నారు. పరీక్షల నిర్వహణ, తదితర అంశాలలో రూమర్లు వ్యాపించకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షల తేదీలలో విద్యార్ధులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకుని పరీక్షా అనంతరం తిరిగి వారి స్వస్ధలాలకు చేరుకునేలా విద్యార్థుల సంఖ్యలకు అనుగుణం పరీక్ష సమయాలలో అదనంగా ఆర్.టి.సి బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. 

పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ 08812-230197 ఫోన్ నెంబరుతో ఏర్పాటు చేశారన్నారు. ప్రాక్టికల్స్.థీయరీ పరీక్షలకు ఫ్లైయింగ్ స్కాడ్లు, సిట్టింగ్ స్కాడ్లను ఏర్పాటు చేయాలన్నారు.  పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్, ఇంటర్ నెట్ సెంటర్లను ఉదయం 8.30 గంటల నుంచి పరీక్ష ముగిసేవరకు ఆయా షాపులను మూసివుంచాలన్నారు.  త్రాగునీరు, పారిశుద్యం ఏర్పాట్లను ప్రతిరోజు పర్యవేక్షించాలని ఆదేశించారు.  ఆయా అధికారులకు అప్పగించిన విధులను అందరూ బాధ్యతతో నిర్వహించి పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలన్నారు.   
         
డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, జిల్లా పరిషత్ సీఈవో శ్రీహరి, డిఎంహెచ్ఓ డా. పి.జే.అమృతం, డ్వామా పీడీ సుబ్బారావు, డిపిఓ కె. అనురాధ, ఆర్ఐఓ పి. యోహాను, ఆర్టీసీ ఆర్ఎం షబ్నం, వయోజన విద్యాశాఖ డిడి ప్రభాకర్, ఏలూరు నగరపాలక సంస్థ మేనేజర్ మూర్తి, జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపల్స్, ప్రభృతులు పాల్గొన్నారు.