నవ్యాంధ్రకు పెట్టుబడులు, యువతకు ఉద్యోగాలే నారా లోకేష్ లక్ష్యం: ఎమ్మెల్యే బడేటి చంటి


ఏలూరు, జనవరి 23: ఒకవైపు నవ్యాంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులను ఆకర్షించడం, మరోవైపు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, టీడీపీ యువనేత నారా లోకేష్ ముందుకు సాగుతున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) స్పష్టం చేశారు. ఇదే లక్ష్యంతో రాష్ట్ర ప్రజలందరికీ మరిన్ని మేళ్లు చేకూరాలని ఆయన ఆకాంక్షించారు.


రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక పవర్‌పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 11 మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్లను పంపిణీ చేశారు. ఈ తోపుడు బండ్లను తన సొంత నిధులతో సమకూర్చిన ఎమ్మెల్యే, వ్యాపారులకు భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, మంత్రి నారా లోకేష్ నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆయన స్ఫూర్తితోనే సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. లక్షలాది ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు నారా లోకేష్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, పార్టీ నాయకులు ఆర్నేపల్లి తిరుపతి, పూజారి నిరంజన్, జంపా సూర్యనారాయణ, వీరమాచినేని చందు, రెడ్డి ఈశ్వరరావు, సిరిశెట్టి నారాయణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.