ఏలూరు, జనవరి 23: కార్యకర్తలను దేవుళ్లుగా భావించేది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమేనని, పార్టీ బలోపేతానికి అహర్నిశలు కష్టపడే ప్రతి కార్యకర్తకూ సముచిత స్థానం కల్పించాలన్న ఆలోచనతో పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారని రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి పేర్కొన్నారు. రాజకీయాల్లో ‘బడేటి’ అంటేనే ఒక బ్రాండ్ అని, అటువంటి కుటుంబానికి చెందిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) నాయకత్వంలో జిల్లాలో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఏలూరుకు సమీపంలోని క్రాంతి కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి పార్థసారధి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు బడేటి చంటి, ప్రధాన కార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి సహా ఇతర కార్యవర్గ సభ్యులతో మాజీ జిల్లా అధ్యక్షులు, అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ప్రమాణ స్వీకారం చేయించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలతో సభా ప్రాంగణం సందడిగా మారింది.
సభ ప్రారంభానికి ముందు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, జిల్లా అధ్యక్షులు బడేటి చంటి, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ కేక్‌ను కట్ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పార్థసారధి మాట్లాడుతూ, జిల్లా పార్టీ రథసారథిగా బడేటి చంటి అందరినీ ఏకతాటిపైకి తీసుకెళ్లే విధంగా పనిచేయాలని సూచించారు. పార్టీ అధినేత చంద్రబాబు లక్ష్యాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ చేస్తున్న కుయుక్తులు, విమర్శలను సమిష్టిగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ, దేశంలో బీజేపీ తర్వాత అత్యంత పటిష్టమైన సంస్థాగత నిర్మాణం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీనేనని అన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో విజయం లక్ష్యంగా జిల్లా అధ్యక్షులు బడేటి చంటి నాయకత్వంలో నూతన కార్యవర్గం సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు.
జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, సమన్వయం, సమర్థత, సమాలోచనలతో తెలుగుదేశం పార్టీని ఏలూరు జిల్లాలో తిరుగులేని శక్తిగా నిలిపేందుకు అందరి సహకారంతో కృషి చేస్తానని తెలిపారు. పార్టీ కార్యకర్తల మనోభావాలు కాపాడే విధంగా నిబద్ధతతో ముందుకెళ్తానని, టిడిపి బలోపేతంతో పాటు కూటమి సఖ్యతను కూడా కాపాడుతూ బాధ్యతాయుతంగా పనిచేస్తానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ఏడూ నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షులు బడేటి చంటిని గజమాలలు, దుశ్శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించారు.















Social Plugin