ద్వారక తిరుమల మండలంలో రహదారి భద్రతపై అవగాహన – ‘హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి’ స్పెషల్ డ్రైవ్


ద్వారక తిరుమల/భీమడోలు:  రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు సోమవారం భీమడోలు ఇన్స్పెక్టర్ యు.జే. విల్సన్ ఆధ్వర్యంలో ద్వారక తిరుమల మండలం ఎం. నాగులపల్లి గ్రామంలో రహదారి భద్రత అవగాహన కార్యక్రమం మరియు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ద్వారక తిరుమల ఎస్‌ఐ సుధీర్ తమ సిబ్బందితో కలిసి పాల్గొన్నారు.


‘హెల్మెట్ ధరించండి – ప్రాణాలు కాపాడుకోండి’ అనే నినాదంతో నిర్వహించిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో హెల్మెట్ ధరించని వాహనదారులకు జరిమానాలు విధించకుండా, వారితోనే హెల్మెట్లు కొనుగోలు చేయించి అవగాహన కల్పించడం విశేషం. అలాగే హెల్మెట్ లేని వాహనదారులు, సరైన పత్రాలు లేని వారిని ఆపి రహదారి భద్రతపై పోలీస్ అధికారులు వివరించారు.

ఈ సందర్భంగా భీమడోలు ఇన్స్పెక్టర్ యు.జే. విల్సన్, ద్వారక తిరుమల ఎస్‌ఐ సుధీర్ మాట్లాడుతూ రహదారి ప్రమాదాల్లో మృతి చెందుతున్న వారిలో అత్యధికులు యువతే ఉండటం ఆందోళనకరమని తెలిపారు. ప్రమాదాలకు ప్రధాన కారణాలు అతివేగం, నిర్లక్ష్యం, థ్రిల్ కోసం బైక్‌లను అతి వేగంగా నడపడం వంటివేనని, ఇవి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నాయని హెచ్చరించారు.

ప్రమాదం జరిగినప్పుడు తలకు తగిలే చిన్న దెబ్బ కూడా ప్రాణాంతకంగా మారవచ్చని, హెల్మెట్ ధరించడం వల్ల మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని వారు స్పష్టం చేశారు. కేవలం జరిమానాలు విధించడమే కాకుండా, ప్రమాదాల వల్ల కుటుంబాలు ఎదుర్కొనే ఆవేదనను వివరించి వాహనదారులకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా పోలీసులు వాహనదారులకు పలు సూచనలు చేశారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇచ్చి వారి ప్రాణాలను ప్రమాదంలో పడేయరాదని హెచ్చరించారు. ఎవరైనా మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మీ ప్రయాణం సురక్షితంగా ఉండాలంటే ట్రాఫిక్ నియమాలను పాటించి, పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలకు ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.