నూజివీడు: నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ ఆదేశాల మేరకు నూజివీడు రూరల్ సీఐ కె. రామకృష్ణ ఆధ్వర్యంలో ముసునూరు ఎస్‌ఐ ఎం. చిరంజీవి తమ సిబ్బందితో కలిసి ముసునూరు గ్రామ పరిధిలో విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ వినియోగం, రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై డయల్ 112 సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ముసునూరు ఎస్‌ఐ ఎం. చిరంజీవి మాట్లాడుతూ, రోడ్డు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయం నుంచి రక్షణ పొందవచ్చని ఆయన తెలిపారు. అలాగే వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, అతివేగంగా వాహనాలు నడపరాదని హితవు పలికారు. “వేగం వద్దు – ప్రాణం ముద్దు” అనే నినాదాన్ని గుర్తుంచుకోవాలని కోరారు.
ప్రమాదం జరిగిన తర్వాత బాధపడే కంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలని పేర్కొన్నారు. విజిబుల్ పోలీసింగ్ సందర్భంగా ప్రజలకు సైబర్ నేరాలపై జాగ్రత్తలు వివరించి, సైబర్ నేరగాళ్లకు అవకాశాలు ఇవ్వకుండా తమ డబ్బును కాపాడుకోవాలని సూచించారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930కు సమాచారం ఇవ్వాలని, సమాచారం అందించిన యెడల తగిన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు డయల్ 112కు సమాచారం ఇచ్చి పోలీసుల సహాయాన్ని పొందవచ్చని వివరించారు.
అలాగే మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించిన ఎస్‌ఐ, మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇచ్చిన పక్షంలో వారి రక్తబంధువులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ విజిబుల్ పోలీసింగ్, అవగాహన కార్యక్రమం ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడంలో, నేరాల నివారణలో కీలకంగా ఉపయోగపడుతుందని ఎస్‌ఐ ఎం. చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో కుటుంబ సభ్యులు తమపై ఆధారపడి ఉన్నారని గుర్తుంచుకుని, సురక్షితంగా ప్రయాణించి గమ్యస్థానాలకు చేరాలని వాహనదారులకు సూచించారు.















Social Plugin