పిజిఆర్ యస్ లో అందిన ప్రతి అర్జీని చాలెంజీగా తీసుకుని పరిష్కరిస్తే అర్జీదారులు సంతృప్తి చెందుతారు.


ధరఖాస్తులు పరిష్కారంలో అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.
అర్జీదారుల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్న కలెక్టర్.
పిజిఆర్ యస్ లో అందిన అర్జీలు 206. 
జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ...


ఏలూరు: జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజాసమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లాస్థాయీ అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా జాయింటు కలెక్టరు యం.జె.అభిషేక్ గౌడ, జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వర రావు, ఆర్డీవో యం.అచ్యుత అంబరీష్, స్పెషల్ డిప్యూటీ కలెక్టరు యల్.దేవకిదేవి, డిఆర్డిఏ పిడి ఆర్.విజయ రాజు, ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటి, నగర పాలక సంస్థ కమీషనరు ఏ.భాను ప్రతాఫ్ లు  స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ మన దగ్గరకు వచ్చిన ఫిర్యాదుదారులతో ఆప్యాయతతో పలకరించి సమస్యలను పూర్తిగా విని చక్కని పరిష్కారం చూపాలని అన్నారు. పిజిఆర్ యస్, రెవిన్యూ క్లినిక్ లలో ప్రజలు సమర్పించిన అర్జీలుపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అధికారులు క్షేత్రస్థాయిలో అర్జీదారులతో  స్వయంగా మాట్లాడి నాణ్యమైన  పరిష్కారాన్ని చూపాలన్నారు. ఏ శాఖకు వచ్చిన అర్జీలు ఆయా శాఖ వారు మాత్రమే పరిష్కారం చూపాలని, వేరే శాఖకు పంపినట్లయితే కాలయాపనలు జరిగి సమస్యలు ఉత్పన్నం అవుతాయన్నారు. 

క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే సమస్యలకు క్షేత్రస్థాయిలోనే  పరిష్కారం చేసి అర్జీలు రీఓపెన్‌కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపినప్పుడు అర్జీదారులు సంతృప్తి చెందుతారని అటువంటి పరిష్కారాలను విజయగాథలుగా జిల్లా కార్యాలయంకు పంపించాలని అన్నారు.  పిజిఆర్ యస్ పట్ల ప్రజల్లో మరింత నమ్మకం, గౌరవం కలిగేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. భూ సమస్యలు రెవిన్యూ క్లినిక్ ద్వారా పరిష్కరించుకోవాలని కోరారు.

అందిన అర్జీలలో కొన్ని..
నిడమర్రు మండలం  పెదనిండ్రకొలను గ్రామ నివాసి శేషాపు రాంబాబు కాలనీ రహదారిని ఆక్రమించుకున్నారు. ఆక్రమణలు తొలగించి సీసీ రహదారిగా నిర్మాణ చెయ్యాలని కోరారు, 
దెందులూరు మండలం దెందులూరు గ్రామానికి చెందిన జ్యోసుల చంద్రశేఖర్ పశువుల కొరకు జిల్లాలో ఒక అంబులెన్స్ ఏర్పాటు చెయ్యాలని కోరారు, 
ఏలూరు మండలం శాంతినగర్ నివాసి యర్రమిల్లి అచ్యుత రామారావు గతంలో ధాన్యాన్ని తోలినాను. కాస్త కిరాయి ఇప్పించాలని కోరారు, 
కామవరపుకోట మండలం బిసికాలనీ చెందిన మిడత నాగరాజు నా స్థలం ఆక్రమించుకున్నారు, పైగా దౌర్జన్యం చేస్తున్నారు విచారణ చేసి న్యాయం చెయ్యాలని కోరారు.  

ఈ సందర్భంగా అర్జీదారుల వద్దకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీల రిజిస్ట్రేషన్ సిబ్బంది వద్దకు వెళ్లి ఆర్జీలో సక్రమంగా నమోదు చేస్తున్నారా లేదా అని కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా  అధికారులు, జిల్లా కలెక్టరేటు సూపర్డెంట్లు, తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.