పిఠాపురం సంక్రాంతి మహోత్సవాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్


తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం: పిఠాపురం వేదికగా నిర్వహించిన సంక్రాంతి మహోత్సవాలు సాంస్కృతిక వైభవంగా సాగాయి. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం Pawan Kalyan పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సభా వేదిక వద్ద హరిదాసులు, గొబ్బెమ్మలు, వీరనాట్యాలు, తప్పెడగుళ్లు, భక్తి కీర్తనలు, జానపద గీతాలు–నృత్యాలు, గిరిజనుల డింసా నృత్యం, కొండదొరల ఆటపాటలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమాలను ఆసక్తిగా వీక్షించిన పవన్ కళ్యాణ్ కళాకారులను అభినందిస్తూ ప్రోత్సహించారు. ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను ఆయన పరిశీలించారు.


ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… సంక్రాంతి అంటే కోడి పందాలు, పేకాటలు మాత్రమే అన్న భావన పోవాలన్నారు. పండుగ పేరుతో కోట్ల రూపాయలు చేతులు మారతాయన్న అభిప్రాయాన్ని మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

ఈ సభకు హాజరైన మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌లతో పాటు కార్యకర్తలు, అభిమానులకు ఆయన అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన ఆడపడుచులను ఆప్యాయంగా ఆదరించాలని, గోదావరి జిల్లాల ఆతిథ్యాన్ని స్వీకరించాలని కోరారు.

గుప్పెడు పంట పండించేందుకు ఎంతో కష్టం అవసరమవుతుందని, దాన్ని నాశనం చేయడం మాత్రం చాలా సులువని వ్యాఖ్యానించారు. అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం కష్టమైతే, చెడగొట్టడం మాత్రం సులభమన్నారు.


పిఠాపురంలో కొబ్బరి ఆకుపడిన ఘటనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, చిన్న చిన్న విషయాలను పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని విపక్షాలపై విమర్శలు చేశారు. దేశం కోసం పనిచేసేవారు పండుగలకు రాలేదని విమర్శించడం సరికాదన్నారు. తప్పుడు ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

వ్యవస్థను బలోపేతం చేయడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని, నాయకుడు లేకపోయినా పనులు జరిగేలా వ్యవస్థ ఉండాలన్నదే తన ఆలోచన అని చెప్పారు. పిఠాపురంలో రూ.300 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. డబ్బుకోసం రాజకీయాలకు రాలేదని స్పష్టం చేశారు.

పిఠాపురం మహా శక్తిపీఠమని, పురుహూతికా దేవి కొలువైన దివ్యక్షేత్రం, శ్రీపాద క్షేత్రమని పేర్కొన్నారు. తన శ్వాస ఉన్నంతవరకు ప్రజల కోసం పనిచేస్తానని, తనకు కుల, మత, ప్రాంత, అధికార భేదాలు లేవని తెలిపారు. సంక్రాంతి పండుగ ద్వారా మన సంస్కృతిని నలువైపులా చాటాలని, ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.