శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి మాఘమాస రథసప్తమి తిరునాళ్లకు ఘన ఏర్పాట్లు – మంత్రి కొలుసు పార్థసారథి


ఏలూరు జిల్లా, నూజివీడు: ఆగిరిపల్లి మండలంలోని ఆగిరిపల్లి గ్రామంలో శోభనగిరిపై స్వయంభువుగా వెలసిన శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి వారి మాఘమాస రథసప్తమి తిరునాళ్లను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి గారు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.


ఈ రథసప్తమి తిరునాళ్ల సందర్భంగా నిర్వహించనున్న మహా అన్నదాన మహోత్సవంలో సుమారు 20 వేల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత కమిటీకి సూచించారు.

దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ఈ ఆలయాన్ని మంత్రి పార్థసారథి గారి సారథ్యంలో అభివృద్ధి దిశగా నడిపిస్తూ, కొండపైకి ఘాట్ రోడ్ నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పటివరకు రూ.3.50 కోట్ల వ్యయంతో శివాలయం వరకు, అలాగే మూడు గుండ్ల వరకు ఘాట్ రోడ్ అభివృద్ధి చేయించడం ద్వారా వృద్ధులు, దివ్యాంగులు సైతం సులభంగా కొండపైకి వెళ్లే విధంగా మార్గం సుగమమైంది.

ఈ నెల 19వ తేదీ నుండి ప్రారంభమైన రథసప్తమి ఉత్సవాలు ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు. 2001 సంవత్సరం నుండి భక్తుల సహకారంతో నిరాటంకంగా కొనసాగుతున్న అన్నదాన కమిటీ ఇప్పటివరకు రూ.28 లక్షల 50 వేల నిధిని సమీకరించినట్లు వెల్లడించారు.

మంత్రి పార్థసారథి గారి సలహా మేరకు ఈ నిధిని భక్తుల సౌకర్యార్థం ఏదైనా శాశ్వత నిర్మాణానికి వినియోగించి ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. అవసరమైతే ఈ మొత్తానికి తోడు ప్రభుత్వం నుండి అదనపు గ్రాంట్ విడుదల చేయిస్తానని మంత్రి సభాముఖంగా హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి గారు స్వయంగా అన్నదానానికి రూ.1,16,000/- విరాళంగా అందించి, అందరికీ ఆదర్శంగా నిలిచారు. అన్నదాన కమిటీ అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని, పార్టీలకు అతీతంగా ఈ మహా అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలని కోరారు.

అన్నదాన నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, వచ్చిన ప్రతి రూపాయికి పూర్తిగా రసీదులు ఇవ్వాలని, పారదర్శకతతో కార్యక్రమం నిర్వహించాలని మంత్రి పార్థసారథి గారు స్పష్టం చేశారు.