ఏలూరు వైఎంహెచ్ఏ ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు


ఏలూరు, జనవరి 26 : ఏలూరు హిందూ యువజన సంఘం (వైఎంహెచ్ఏ) ఆధ్వర్యంలో 26-01-2026 సోమవారం ఉదయం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను స్థానిక వైఎంహెచ్ఏ హాలు ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎంహెచ్ఏ కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షులు యిరదల ముద్దుకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.


కార్యక్రమానికి ముందు మహాత్మా గాంధీ చిత్రపటానికి సంఘ సభ్యులు పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జనగణమన గీతాన్ని ఆలపించి జాతీయ గౌరవాన్ని చాటారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం లభించి, సమగ్ర చట్టాలతో పరిపాలన వ్యవస్థ బలోపేతమైన రోజు గణతంత్ర దినోత్సవమని తెలిపారు. గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేయడం ప్రజల్లో దేశభక్తిని పెంపొందించే గొప్ప సందర్భమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షులు యిరదల ముద్దుకృష్ణ, ప్రధాన కార్యదర్శి మజ్జి సూర్యకాంతరావు, గౌరవ అధ్యక్షులు అంబికా రాజా, వేణుగోపాల్ లునాని, సభ్యులు డాక్టర్ లంకా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

అలాగే మేనేజ్‌మెంట్ కమిటీ ఉపాధ్యక్షులు ఆర్.ఎన్.ఆర్. నాగేశ్వరరావు, వేమా కోటేశ్వరరావు, కోశాధికారి కానాల బాల వెంకట రమేష్, సహాయ కార్యదర్శి డాక్టర్ గుడిపాటి లలితా శర్మ, సభ్యులు మోతే శ్రీనివాస నారాయణరావు, ఎం.వి. రవీంద్ర, రేవూరి శివశంకర వరప్రసాద్, శలా మాణిక్యాలరావు (రాజా)తో పాటు పలువురు కళాకారులు, ప్రజలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంతో ఘన చరిత్ర కలిగిన ఏలూరు గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవం పురస్కరించుకొని, ఈ రోజు నిర్వహిస్తున్న అమ్మవారి జాతర ఊరేగింపుకు విచ్చేసిన భక్తులకు, ఏలూరు ప్రజలకు, జాతర కొలుపుల కమిటీ నిర్వాహకులకు హిందూ యువజన సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు.