లోపూడి గ్రామంలో కుటుంబంపై సాంఘిక బహిష్కరణ దారుణం : సీపీఐ ఖండన


ఏలూరు జిల్లా, ముసునూరు: మండలం లోపూడి గ్రామంలో బోట్ల కనకారావు కుటుంబంపై సాంఘిక బహిష్కరణ విధించడాన్ని సీపీఐ నూజివీడు నియోజకవర్గ సమితి తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సీపీఐ ఒక ప్రకటన విడుదల చేసింది.


విలేకరులతో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు చలసాని వెంకట రామారావు మాట్లాడుతూ, ప్రజాస్వామిక యుగంలో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఒక కుటుంబాన్ని మోకాళ్లపై కూర్చోబెట్టి సాంఘిక బహిష్కరణ చేయడం, లక్ష రూపాయల జరిమానా విధించడం అత్యంత అన్యాయమని విమర్శించారు. తప్పు చేసినవారిని చట్టానికి అప్పగించాల్సిన బాధ్యత గ్రామ పెద్దలదేనని, కానీ వారు అలా చేయకుండా పైశాచికంగా వ్యవహరించడం దురదృష్టకరమని పేర్కొన్నారు.


గ్రామంలో ఇంటింటికి తిరిగి ఆ కుటుంబాన్ని బహిష్కరించామని, వారికి ఎవరూ సహాయం చేయవద్దని, మాట్లాడరాదని, సంబంధాలు పెట్టుకోరాదని ప్రచారం చేయడం ఆధునిక సమాజంలో అసహ్యకరమైన చర్య అని ఆయన అన్నారు. ఇటువంటి అటవీక చర్యలను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ ఘటనకు బాధ్యులైన ముద్దాయిలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, బహిష్కరణకు గురైన కుటుంబ సభ్యులను తిరిగి గ్రామానికి రప్పించి పూర్తి రక్షణ కల్పించాలని సీపీఐ డిమాండ్ చేసింది.

ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ నూజివీడు నియోజకవర్గ కార్యదర్శి నిమ్మగడ్డ నరసింహ, నియోజకవర్గ నాయకులు రాయకుల లక్ష్మణరావు, కూచిపూడి నాగేశ్వరరావు, ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు డి. శివకుమార్, సీపీఐ నాయకులు మల్లవల్లి మన్మధరావు, డి. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.