ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు ఆపాలి – సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ. రవి డిమాండ్
గ్రామీణ పేదల జీవితాలతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలి
ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం, జనవరి 24: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని, గ్రామీణ పేదలకు హక్కుగా ఉన్న ఉపాధిని కుదించే కేంద్ర ప్రభుత్వ చర్యలను తక్షణమే నిలిపివేయాలని సీపీఐ(ఎం) పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ. రవి డిమాండ్ చేశారు.
జంగారెడ్డిగూడెం మండలం పట్టణ పాలెం గ్రామంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో విడుదల చేసిన కరపత్రాన్ని పోస్టర్ ఆవిష్కరణ ద్వారా ప్రజల్లోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో కోట్లాది మంది గ్రామీణ పేదలకు జీవనాధారంగా నిలుస్తున్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులు తగ్గిస్తోందని విమర్శించారు.
పనిదినాలను తగ్గించడం, ఆన్‌లైన్ నిబంధనల పేరుతో కార్మికులపై భారం మోపడం ద్వారా గ్రామీణ కార్మికులను ఉపాధి లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఇది పేదలను రోడ్డున పడేయాలనే ఉద్దేశంతో తీసుకుంటున్న చర్యలుగా సీపీఐ(ఎం) భావిస్తోందని స్పష్టం చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం, పేదరికం తీవ్రంగా పెరుగుతున్న ఈ సమయంలో ఉపాధి హామీ పథకాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ ప్రయోజనాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ పేదల హక్కులను కాలరాస్తోందని ఆయన విమర్శించారు.
పని దినాలను పెంచాలని, రోజువారీ వేతనాలను పెంపొందించాలని, కార్మికులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమానికి పార్టీ మండల కమిటీ సభ్యులు జోడే సూర్య చంద్రం అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామీణ కార్మికులు పాల్గొని ఉపాధి హామీ పథకాన్ని కాపాడాలని, పేదల హక్కుల కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో బి. దుర్గారావు, కే. ముత్యాలమ్మ, కె. అర్జునరావు, ఎం. వరలక్ష్మి, సింగారమ్మ, పీ. పోతురాజు, సిహెచ్. రవి తదితరులు పాల్గొన్నారు.















Social Plugin