శ్రీ గంగమ్మ తల్లి జాతరలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు – ఏలూరు రేంజ్ ఐజి జివిజి అశోక్ కుమార్


ఏలూరు, జనవరి 24: ఏలూరు నగరం తూర్పు వీధిలోని ప్రసిద్ధ శ్రీ గంగమ్మ తల్లి జాతర ఈ నెల 25, 26 తేదీల్లో జరగనున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఏలూరు రేంజ్ ఐజి జివిజి అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు.


జాతర ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు ఐజి, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ తో కలిసి గంగమ్మ దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ పరిసరాలు, బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లను పరిశీలించి, అధికారులు మరియు జాతర కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు.

జాతర ముగింపు రోజుల్లో భక్తుల రద్దీ భారీగా ఉండే అవకాశం ఉన్నందున ఎక్కడా తోపులాటలు జరగకుండా పటిష్టమైన క్యూలైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించి వారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.

అమ్మవారి ఊరేగింపు సమయంలో నగర ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందస్తుగా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టాలని ట్రాఫిక్ విభాగం అధికారులను ఐజి గారు ఆదేశించారు. రహదారులపై స్పష్టమైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.

జాతర నిర్వహణలో పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖలు మరియు జాతర కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. భక్తుల కోసం అత్యవసర వైద్య శిబిరాలు, తాగునీటి సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలని స్పష్టం చేశారు.

జాతర ముసుగులో మద్యం సేవించి అల్లర్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ముందస్తుగా అటువంటి వారిని గుర్తించేందుకు మఫ్టీలో పోలీసులను రంగంలోకి దించాలని ఐజి సూచించారు. డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఐజి జాతర కమిటీ సభ్యులు మరియు భక్తులకు విజ్ఞప్తి చేస్తూ, పోలీసులకు పూర్తి సహకారం అందించాలని, నిబంధనలు పాటిస్తూ క్రమశిక్షణతో అమ్మవారి దర్శనం చేసుకుని పండుగను శాంతియుతంగా, ఆనందంగా జరుపుకోవాలని కోరారు.

ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, ట్రాఫిక్ పోలీసులు, జాతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఐజి తో పాటు ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్, ఎస్‌బీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వర రావు, ఏలూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్ఐ సుధాకర్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



-----------------------------------------------------------------------------------------------------------------------------