సంక్రాంతి సంబరాల్లో ఎమ్మెల్యేల క్రికెట్ టోర్నమెంట్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు


వేళ్ల చింతలగూడెంలో మైదానంలోకి దిగి బ్యాటింగ్, బౌలింగ్ చేసిన ఎమ్మెల్యే… చప్పట్లతో మార్మోగిన ప్రేక్షకుల హర్షధ్వానాలు

గ్రామీణ యువతకు క్రీడలే బలమైన మార్గం – క్రీడలతో ఆరోగ్యకర సమాజ నిర్మాణం సాధ్యమని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వ్యాఖ్యలు

తూర్పు గోదావరి జిల్లా, గోపాలపురం: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గోపాలపురం మండలం వేళ్ల చింతలగూడెం గ్రామంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, ఆర్.ఎం ఫౌండేషన్ మధు సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యేల క్రికెట్ టోర్నమెంట్ లో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ప్రత్యేక అతిథిగా హాజరై క్రికెట్ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు.

గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు, యువత ప్రతిభకు ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ క్రికెట్ టోర్నమెంట్‌లో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్వయంగా మైదానంలోకి దిగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యువతతో కలిసి బ్యాటింగ్ చేయడంతో పాటు బౌలింగ్ చేసి క్రీడాకారుల ఉత్సాహాన్ని మరింత పెంచారు. ఎమ్మెల్యే ఆటతీరును చూసి ప్రేక్షకులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ అనేది కేవలం పంటల పండుగ మాత్రమే కాకుండా గ్రామీణ సంస్కృతి, ఐక్యత, స్నేహబంధాలను బలోపేతం చేసే మహత్తర పండుగ అని అన్నారు. గ్రామాల్లో నిర్వహించే క్రీడా పోటీలు యువతను చెడు అలవాట్ల నుండి దూరంగా ఉంచి క్రమశిక్షణ, నాయకత్వ గుణాలు అలవర్చుతాయని పేర్కొన్నారు. క్రీడల ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు.

అలాగే, ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, ఆర్.ఎం ఫౌండేషన్ మధు ని ప్రత్యేకంగా అభినందిస్తూ, గ్రామీణ యువత కోసం క్రీడా వేదికలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. పోలవరం నియోజకవర్గంలో యువత అభివృద్ధి కోసం క్రీడలు, విద్య, ఉపాధి రంగాల్లో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను పూర్తిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన క్రికెట్ జట్ల సభ్యులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ముగింపులో నిర్వాహకులకు, పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శుభాకాంక్షలు తెలిపారు.