ఏలూరు, జనవరి 23: కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర, ఏలూరు జిల్లా నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం ఏలూరులోని రెవెన్యూ భవన్‌లో APJAC అమరావతి 4వ రాష్ట్ర మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ. మధుబాబు మాట్లాడుతూ, ఏలూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరూ ఫిబ్రవరి 5వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న APJAC అమరావతి ఆవిర్భావ దినోత్సవ మహాసభకు వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ మహాసభకు ప్రభుత్వ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, సత్య ప్రసాద్ గారు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని తెలిపారు. కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్, APJAC అమరావతితో అనుబంధంగా కొనసాగుతోందని స్పష్టం చేశారు.
APJAC అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఈ సభలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ పథకాలు, ఉద్యోగ భద్రత, పీఆర్‌సీ వంటి కీలక అంశాలను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తారని తెలిపారు. అందువల్ల ప్రతి ఒక్క ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఈ మహాసభలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వ పెద్దల నుండి ఔట్సోర్సింగ్ వ్యవస్థకు స్పష్టమైన హామీ వచ్చేలా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లను కూడా వివరించారు.
ఆప్కాస్‌లో ఉన్న లోపాలను సరిదిద్ది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, సెర్ఫ్, మెప్మా ఉద్యోగుల మాదిరిగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా నాయకులు బి. సోమయ్య, కె. విగ్నేష్, ఆర్. నాగరాజు, లావేటి కృష్ణారావు, బంగారు వెంకటేశ్వరావుతో పాటు పలువురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.















Social Plugin