రాజ్యాంగ విలువలను మరింత బలోపేతం చేయాలి – ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి


ఏలూరు, జనవరి 26 : దేశ రాజ్యాంగ విలువలను మరింత ఇనుమడింపచేసే విధంగా ప్రతి పౌరుడు నడుచుకోవాలని, అప్పుడే సుస్థిరత, సౌభ్రాతృత్వం సాకారమై అభివృద్ధి చెందిన ఉజ్వల భారతం అవతరిస్తుందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అభిప్రాయపడ్డారు.


భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌తో పాటు ఇతర మహనీయుల ఆశయాల సాధనకు ప్రజలు సమిష్టిగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. 77వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏలూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో టిడిపి జిల్లా అధ్యక్షులు బడేటి చంటి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

కార్యక్రమ ప్రారంభంలో టిడిపి జిల్లా అధ్యక్షులు బడేటి చంటి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

రాజ్యాంగాన్ని రూపొందించి అమల్లోకి తెచ్చి, స్వాతంత్ర్య ఫలాలను ప్రతి ఒక్కరికి అందించిన మహనీయుల ఆశయాల సాధనకు పునరంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, బీఎస్‌ఎన్‌ఎల్ అడ్వైజరీ బోర్డు కమిటీ మెంబర్ లంకపల్లి మాణిక్యాలరావు, శనివారం పేట సొసైటీ బ్యాంక్ చైర్మన్ కోనేరు వంశీ, టిడిపి నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి నాగరాజు, అలాగే వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.