ఏలూరు: సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను బంపర్ హిట్ చేసిన 2025 సంవత్సరానికి ఘనంగా వీడ్కోలు పలుకుతూ, సరికొత్త ప్రజాహిత ప్రణాళికాయుత పాలనతో 2026 నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. గత ఏడాది కూటమి ప్రభుత్వానికి గోల్డెన్ ఇయర్ లాంటిదని పేర్కొన్న ఆయన, కొత్త ఏడాదిలో అంతకుమించిన ఫలితాలు సాధించే దిశగా పనిచేస్తామని స్పష్టం చేశారు.
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఏలూరు పవర్‌పేటలోని బడేటి చంటి క్యాంపు కార్యాలయం సందడి, ఉత్సాహంతో కళకళలాడింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నేతలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యేను శుభాకాంక్షలతో ముంచెత్తారు. పుష్పగుచ్ఛాలు, దుశ్శాలువాలు, పండ్ల బొకేలు, జ్ఞాపికలు అందించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ విజయవాడ జోన్–2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు తదితరులు ఎమ్మెల్యే బడేటి చంటిని దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే వివిధ ఉద్యోగ సంఘాలు, కుల సంఘాల ప్రతినిధులు క్యాలెండర్లు, డైరీలను ఆవిష్కరించారు. మహిళాభిమానులు కూడా ప్రత్యేకంగా విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే బడేటి చంటి, తన గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యకర్తల త్యాగాలు, కష్టాలకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని చెప్పారు. 2026లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరింత సమర్థవంతమైన పాలన అందించి అభివృద్ధి, సంక్షేమంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతామని ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, కూటమి నేతలు, బడేటి అభిమానులు, నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
















Social Plugin