మండపేటలో 1984–85 ఎస్‌వీఎస్‌ఆర్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం


పేదలకు చీరలు, మెరిట్ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు పంపిణీ


తూర్పు గోదావరి జిల్లా, మండపేట: జీవితంలో తాము సాధించిన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని సమాజ సేవా కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత ఇనపకోళ్ల గణేష్ చౌదరి అన్నారు. 1984–85 విద్యా సంవత్సరానికి చెందిన మండపేట ఎస్‌వీఎస్‌ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం స్థానిక కాపు భవన్‌లో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ఆనాటి విద్యార్థులు, ఈ బ్యాచ్‌లో కలిసి చదువుకున్న విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత ఇనపకోళ్ల గణేష్ చౌదరి, విజయలక్ష్మి ఫైనాన్స్ అధినేత కర్రి వెంకట రమణ, టీడీపీ నాయకులు సూరంపూడి గని రాజులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉపాధ్యాయులు, నిర్వాహకులు వాడ్రేవు శ్రీనివాస్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎస్‌వీఎస్‌ఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతిలో 573 మార్కులు సాధించిన ముమ్మసాని దయా సాగర్‌కు రూ.8 వేల నగదు బహుమతి, 563 మార్కులు సాధించిన కోసూరి వరుణ్ సంతోష్‌కు రూ.4 వేల నగదు బహుమతిని అందజేశారు. అదేవిధంగా సుమారు 50 మంది పేదలకు చీరలు పంపిణీ చేశారు.

ఈ సమావేశంలో ఆనాటి పదవ తరగతి ఏ, బి, సి సెక్షన్లకు చెందిన సుమారు 80 మంది పూర్వ విద్యార్థులు పాల్గొని తమ విద్యా కాలం జ్ఞాపకాలను పంచుకున్నారు. ప్రతి ఏడాది ఇలాగే సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.

ఈ కార్యక్రమంలో హెచ్‌ఎఫ్‌ఎస్ గౌరవ సలహా కమిటీ సభ్యులు సీనియర్ జర్నలిస్ట్ సయ్యద్ హుస్సేన్, కార్యనిర్వహక కమిటీ సభ్యులు యేలేటి శ్రీనివాస్ (డిస్కో), అవసరాల ధర్మరాజు, దూలం నాగేశ్వరరావు, శెట్టి నాగేశ్వరరావు, చింతల శ్రీనివాస్, గ్రంథి నమశ్శివాయ, నామాల సత్యనారాయణ, ఎండి అల్తాఫ్, సిరా జోజీబాబు, సయ్యద్ రబ్బానీ, ఎండి ఖాజా, షా హస్తే హుస్సేన్, యలమంచిలి శ్రీనివాస్, అంగర శ్రీనివాస్, సుంకర బాలాజీ, గుణ్ణం సత్యనారాయణ, పాండ్రంకి శ్రీనివాస్, పున్నంరాజు శ్రీహరి, కందుల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.