ఏలూరు, డిసెంబర్ 9 : రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఏలూరు పోలీసు శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ మరియు నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ గారి ఆదేశాల మేరకు పెదవేగి సర్కిల్ పోలీసు అధికారులు సోమవరపాడు గ్రామంలో భారీ స్థాయిలో వాహన తనిఖీలను చేపట్టారు. పెదవేగి ఇన్‌స్పెక్టర్ సిహెచ్. రాజశేఖర్ ఆధ్వర్యంలో దెందులూరు ఎస్ఐ శివాజీ సిబ్బందితో కలిసి ఈ తనిఖీలను నిర్వహించారు.
తనిఖీల సమయంలో వాహనదారులకు రోడ్డు భద్రత నియమాలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా ISI మార్క్ గల హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనదారులు ప్రయాణంలో సీటు బెల్ట్ తప్పక ఉపయోగించాలని సూచించారు. “వేగం వద్దు – ప్రాణం ముద్దు”, “ప్రపంచానికి నువ్వు ఒక్కడివే కాకపోయినా, నీ ఇంటికి నువ్వే పెద్ద దిక్కు” అనే సందేశాలను ప్రజల్లో నాటాలనే లక్ష్యంతో పోలీసులు చైతన్య కార్యక్రమం నిర్వహించారు.
వాహన తనిఖీల్లో డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, ప్యాల్యూషన్ సర్టిఫికేట్ వంటి ప్రధాన పత్రాలు లేని వాహనదారులపై ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ జరిమానాలు విధించారు. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందేనని తెలిపారు.
“రోడ్డు భద్రత పట్ల జాగ్రత్తలు పాటించినప్పుడే ప్రమాదాలను తగ్గించగలం. ట్రాఫిక్ నియమాలు పాటించి మన కుటుంబాలను, మన సమాజాన్ని కాపాడాలి” అని ప్రజలకు ప్రతిజ్ఞ చేయించినట్లు ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పెదవేగి సర్కిల్‌కు చెందిన పోలీసులు పాల్గొన్నారు.















Social Plugin