ఆగిరిపల్లిలో విజిబుల్ పోలీసింగ్ – రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన


ఏలూరు జిల్లా, ఆగిరపల్లి/నూజివీడు: నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ ఆదేశాల మేరకు, నూజివీడు రూరల్ సీఐ కె. రామకృష్ణ ఆధ్వర్యంలో ఆగిరిపల్లి ఎస్ఐ శుభ శేఖర్ తమ సిబ్బందితో కలిసి ఆగిరిపల్లి మండలంలోని గ్రామ పరిధిలో విస్తృత స్థాయిలో విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు.


ఈ కార్యక్రమంలో ఎస్ఐ శుభ శేఖర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ వాడకం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయం నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు. అలాగే వాహనదారులు అతివేగంగా నడపకుండా ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని హితవు పలికారు. “వేగం వద్దు – ప్రాణం ముద్దు” అనే నినాదాన్ని గుర్తుంచుకోవాలని కోరారు.

ప్రమాదం జరిగిన తరువాత బాధపడే కంటే ముందే జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలని ఆయన పేర్కొన్నారు. విజిబుల్ పోలీసింగ్ సందర్భంగా సైబర్ నేరాలపై కూడా అవగాహన కల్పిస్తూ, సైబర్ నేరగాళ్లకు అవకాశం ఇవ్వకుండా తమ డబ్బును రక్షించుకోవాలని సూచించారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 ద్వారా పోలీసుల సహాయం పొందవచ్చని వివరించారు.

అదేవిధంగా మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరించారు. మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇచ్చినట్లయితే వారి రక్త బంధువులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ విజిబుల్ పోలీసింగ్, అవగాహన కార్యక్రమం ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడంలో, నేరాల నివారణలో దోహదపడుతుందని ఎస్ఐ శుభ శేఖర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో తమపై కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకుని, సురక్షితంగా ప్రయాణించి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరాలని వాహనదారులకు సూచించారు.