ఏలూరు జిల్లా,ఏలూరు: పోలవరం ఆదివాసీ ప్రాంతాలను పోలవరం జిల్లాలో చేర్చాలని, జిల్లాల పునర్విభజనపై కూటమి ప్రభుత్వం శాస్త్రీయంగా ఆలోచించి ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వాలని సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ తరఫున ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఏ. రవి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజనపై చేసిన రెండో ప్రకటన ఏజెన్సీ ప్రాంత ప్రజలను తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిందని ఆయన అన్నారు.
ఏలూరు జిల్లాలోని పోలవరం ఆదివాసీ ప్రాంతాలను పోలవరం జిల్లాలో కలపాలని కొంతకాలంగా ఆ ప్రాంత ఆదివాసీలు, ప్రజా సంఘాలు, ప్రజానీకం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారని తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి స్పందన చూపకుండా తమకు నచ్చిన విధంగా వ్యవహరిస్తోందని, దీని వల్ల ప్రజాభిప్రాయానికి విలువ లేకుండా పోతోందని విమర్శించారు.
మొదటి ప్రకటనలో జిల్లాల పునర్విభజన శాస్త్రీయంగా జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించుకున్నప్పటికీ, పోలవరం జిల్లాలో పోలవరం లేకపోవడం ఎంతవరకు శాస్త్రీయమని ఆయన ప్రశ్నించారు. ఇది పూర్తిగా అశాస్త్రీయమని, పోలవరం జిల్లాలో పోలవరం లేకపోవడం హాస్యాస్పదంగా మారిందని, ప్రజలు దీనిపై ఎద్దేవ చేస్తున్నారని అన్నారు. ఎలాంటి శాస్త్రీయత లేకుండా జిల్లాల పునర్విభజన చేయడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వ నాయకులతో పాటు ఇప్పటికీ చాలామంది పోలవరం జిల్లాలో పోలవరం ఉందనే భ్రమలో ఉన్నారని, వాస్తవంగా పోలవరం జిల్లాలో పోలవరం లేదని తెలిసి ఆశ్చర్యానికి గురవుతున్నారని తెలిపారు. రెండో ప్రకటనలో ప్రజల అభిప్రాయ సేకరణకు అనుగుణంగా జిల్లాల పునర్విభజన చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, ఆచరణలో మాత్రం ప్రజల అభిప్రాయాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
పోలవరం ఆదివాసీ ప్రాంతాలను పోలవరం జిల్లాలో చేర్చాలని గ్రామ గ్రామాన, మండల స్థాయిలో ప్రజలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారని, సచివాలయాలు, ఎమ్మార్వో కార్యాలయాలకు వినతిపత్రాలు సమర్పించడంతో పాటు ఈనెల 23న నిర్వహించిన మన్యంబంద్ కూడా విజయవంతమైందని ఏ.రవి తెలిపారు. దీనిని బట్టి అక్కడి ప్రజలు గట్టిగా తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నట్టు స్పష్టమవుతుందని అన్నారు.
మొదట శాస్త్రీయత పేరుతో అశాస్త్రీయ ప్రకటనలు చేసి, ఇప్పుడు ప్రజల అభిప్రాయాల మేరకే చేస్తున్నామని చెప్పి వాటికి విలువ ఇవ్వకుండా ప్రభుత్వం ముందుకెళ్తోందని విమర్శించారు. ఈ తరహా ప్రభుత్వ వైఖరిని సిపిఎం తీవ్రంగా ఖండిస్తోందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ఈ అంశంపై క్యాబినెట్‌లో చర్చించి, శాస్త్రీయంగా మరియు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా జిల్లాల పునర్విభజన చేసి, పోలవరం జిల్లాలో పోలవరం ఆదివాసీ ప్రాంతాలను చేర్చాలని ఏ. రవి డిమాండ్ చేశారు.
_11zon.png)














Social Plugin