జీలుగుమిల్లిలో అంతరాష్ట్ర గంజాయి ముఠా బట్టబయలు – 10.150 కిలోల గంజాయి స్వాధీనం, ఇద్దరి అరెస్ట్


ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి: ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా పోలీసులు చేపడుతున్న ప్రత్యేక తనిఖీల్లో భాగంగా జీలుగుమిల్లి పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. ఈ ఘటనలో అంతరాష్ట్ర గంజాయి ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి సుమారు 10.150 కిలోల గంజాయి, ఒక హీరో గ్లామర్ మోటార్ సైకిల్, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.


ఉదయం సుమారు 11 గంటల సమయంలో జీలుగుమిల్లి ఎస్‌ఐ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది జంగారెడ్డిగూడెం–అశ్వారావుపేట జాతీయ రహదారి (NH-516D)పై వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో ఒక మోటార్ సైకిల్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నం చేయగా, అనుమానం కలిగిన పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు.

వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, సీటు కింద చాకచక్యంగా దాచిన గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. పట్టుబడిన నిందితులు తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాకు చెందిన రాజ్‌పుత్ కమల్ సింగ్(67), ఎల్చిపూర్ గ్రామం, అలాగే ఆకుల వంశికృష్ణ(29), దోమకొండ మండలం నివాసులుగా గుర్తించారు.

విచారణలో, వీరు ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, కామారెడ్డి ప్రాంతానికి తరలించి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. నిందితులపై NDPS యాక్ట్ – 1985 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ గంజాయి అక్రమ రవాణా నెట్‌వర్క్‌కు సంబంధించిన మరికొందరి కోసం దర్యాప్తు కొనసాగుతోందని పోలవరం డీఎస్పీ ఎం. వెంకటేశ్వరరావు, జీలుగుమిల్లి ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాను సమర్థవంతంగా అడ్డుకున్న పోలవరం డీఎస్పీ, జీలుగుమిల్లి సీఐ, ఎస్‌ఐ క్రాంతి కుమార్ మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, రవాణాకు సంబంధించిన సమాచారం ఎవరికైనా ఉంటే వెంటనే డయల్ 112కు గాని, సమీప పోలీస్ స్టేషన్‌కు గాని తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.