నిజమైన పోరాట యోధుడు వంగవీటి మోహన రంగా: ఎమ్మెల్యే బడేటి చంటి


ఏలూరు, డిసెంబర్ 26: పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం జీవితాంతం పోరాటం చేసిన నిజమైన పోరాట యోధుడు దివంగత వంగవీటి మోహన రంగా అని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. నిరుపేదల పెన్నిధిగా పేరుగాంచిన స్వర్గీయ వంగవీటి మోహన రంగా 37వ వర్థంతి సందర్భంగా ఏలూరులోని సర్ సి.ఆర్.రెడ్డి కాలేజీ వద్ద ఉన్న రంగా విగ్రహం వద్ద ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా టిడిపి అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ విజయవాడ జోన్–2 చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు హాజరై రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, తుది శ్వాస వరకు పేదల పక్షాన నిలబడి వారి అభ్యున్నతే ధ్యేయంగా జీవించిన మహానీయుడు వంగవీటి మోహన రంగా అని కొనియాడారు. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. రంగా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన స్ఫూర్తితోనే తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని స్పష్టం చేశారు.

ఆర్టీసీ జోన్–2 చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ, వంగవీటి రంగా పేదల కోసం చేసిన సేవలు, ప్రజల హృదయాల్లో ఆయన సంపాదించుకున్న స్థానం చిరస్మరణీయమని అన్నారు. ఎన్ని తరాలైనా రంగా ఆశయాలు ప్రజల్లో జీవిస్తూనే ఉంటాయని, ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.

అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కాపు బలిజ సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు పుప్పాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాము సూర్యారావు, నాయకులు ఆర్నేపల్లి తిరుపతి, ఇరదల ముద్దుకృష్ణ, మారం హనుమంతరావు, లావేటి శ్రీనివాస్, జిల్లా రైతు అధ్యక్షులు నాగం శివ, కాపు బలిజ సంక్షేమ సేన ఏలూరు అసెంబ్లీ అధ్యక్షులు కంది రంగబాబు, నాయకులు యడ్లపల్లి ప్రసాద్, జల్లా హరికృష్ణ, దాసు మహేష్, బోండా రాము నాయుడు, కొప్పి శెట్టి వేణుగోపాల్, గాదె రాంబాబు, పాలేటి బాబి, ఫణి రాజ్, తాడికొండ శ్రీనివాస్, గూడూరి హేమ దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.