ఏలూరు జిల్లా, ఏలూరు: సమాజంలో మార్పు కోసం జరిగే ఉద్యమాలకు కమ్యూనిస్టు పార్టీనే స్పష్టమైన మార్గదర్శమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ అన్నారు. సీపీఐ శత వార్షికోత్సవాల సందర్భంగా ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం 16వ డివిజన్‌లో భారీ ర్యాలీ నిర్వహించగా, అనంతరం పాల తూము సెంటర్‌లో బహిరంగ సభ జరిగింది. ఈ సభకు డివిజన్ కార్యదర్శి కొల్లూరి సుధారాణి అధ్యక్షత వహించారు.
బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డేగా ప్రభాకర్ మాట్లాడుతూ, దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్య సాధనలో, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో సీపీఐ కీలక పాత్ర పోషించిందన్నారు. త్యాగాలు, సమరశీల పోరాటాలు, మహోన్నత ఉద్యమ చరిత్ర కలిగిన పార్టీ సీపీఐ అని పేర్కొన్నారు. దోపిడీ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా సీపీఐ ఆవిర్భవించిందని తెలిపారు.
కార్మికులు, రైతులు, విద్యార్థులు, యువజనుల జీవన పరిస్థితులు మెరుగుపడేలా అనేక ఉద్యమాలు నిర్వహించి సమస్యల పరిష్కారంలో సీపీఐ ముఖ్య భూమిక నిర్వహించిందన్నారు. అధికారం లేకపోయినా పేద, బడుగు, బలహీన వర్గాలకు లక్షలాది ఎకరాల భూమి పంపిణీ చేసిన ఘన చరిత్ర కమ్యూనిస్టు పార్టీదేనని గుర్తు చేశారు. గూడు లేని పేదలకు ఇళ్ల స్థలాల కోసం పోరాడి సాధించిన పార్టీ సీపీఐ అని అన్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని విమర్శించారు. స్వాతంత్ర్యం తర్వాత 14 మంది ప్రధానమంత్రులు కలిపి రూ.55 లక్షల కోట్ల అప్పులు చేస్తే, మోడీ పాలనలో కేవలం 12 ఏళ్లలోనే రూ.200 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. రైతుల రుణమాఫీకి మీనమేషాలు లెక్కించే ప్రభుత్వం, కార్పొరేట్ శక్తులకు మాత్రం రూ.16 లక్షల కోట్ల రుణమాఫీ చేసి ఊడిగం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నాటి నుంచి నేటి వరకు నిరంతరం పోరాడుతున్నది కమ్యూనిస్టులేనని అన్నారు.
సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ, స్వాతంత్ర్య పోరాటంలో పాత్రలేని బీజేపీ నేడు దేశభక్తి గురించి మాట్లాడటం విడ్డూరమని ఎద్దేవా చేశారు. ఖనిజ సంపద పేద ప్రజలకే దక్కాలని తొలినాటి నుంచే సీపీఐ పోరాడుతోందన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో 2026 మార్చి 31 నాటికి నక్సలైట్లను తుదముట్టిస్తామని హోంమంత్రి అమిత్ షా ప్రకటించడం ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్రలో భాగమేనని ఆరోపించారు. అభివృద్ధికి కూడా గడువు తేదీ నిర్ణయించాలని డిమాండ్ చేశారు.
యూపీఏ-1 ప్రభుత్వంలో వామపక్షాల పోరాటం ఫలితంగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ అన్న ప్రధాని మోడీ, దేశమంతటా వ్యవసాయ కూలీలకు ఒకే కూలి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పరిశ్రమలన్నీ ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని డిమాండ్ చేశారు. జీఎన్‌ఆర్‌ఈజీఏ పథకాన్ని నిర్వీర్యం చేయాలన్న ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా కార్మికులను ఏకం చేసిన కమ్యూనిస్టులపై ఎన్నో కుట్రలు, కేసులు పెట్టినా వెనకడుగు వేయని చరిత్ర సీపీఐ సొంతమన్నారు. కమ్యూనిస్టుల పోరాటాల ఫలితంగానే బ్యాంకుల జాతీయకరణ జరిగి గ్రామీణ పేదలకు సేవలు అందుతున్నాయని తెలిపారు.
సీపీఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్, జిల్లా సమితి సభ్యులు పుప్పాల కన్నబాబు మాట్లాడుతూ, దున్నేవాడికే భూమి దక్కాలన్న నినాదంతో భూ పంపిణీ ఉద్యమాలకు శ్రీకారం చుట్టింది కమ్యూనిస్టులేనన్నారు. కార్మిక హక్కులు, వ్యవసాయ కూలీల న్యాయమైన కూలీల కోసం సీపీఐ ఎన్నో పోరాటాలు చేసిందని చెప్పారు. సమాచార హక్కు చట్టం కూడా కమ్యూనిస్టుల పోరాట ఫలితమేనని పేర్కొన్నారు.
జనవరి 18న ఖమ్మంలో జరిగే సీపీఐ శతవసంతాల ముగింపు సభకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున సీపీఐ శ్రేణులు, అభిమానులు, ప్రజా సంఘాలు తరలివచ్చి విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
కార్యక్రమానికి తొలుత సీపీఐ ఏలూరు ఏరియా సమితి సహాయ కార్యదర్శి కురెళ్ళ వరప్రసాద్ అతిథులను ఆహ్వానించగా, ఏరియా కార్యవర్గ సభ్యురాలు గొర్లి స్వాతి వందన సమర్పణ చేశారు. ఇటీవల తనకు దొరికిన ఐదు కాసుల గొలుసును నిజాయితీగా పోలీసులకు అప్పగించిన అడ్డగర్ల లక్ష్మి ఇందిరాను జిల్లా కార్యదర్శి శాలువా కప్పి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా, ఏరియా నాయకులు, కార్యవర్గ సభ్యులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
















Social Plugin