"అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం" లో ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాదు


విభిన్న ప్రతిభావంతులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత మనందరిది

ఏలూరు,పెదవేగి మండలం, డిసెంబరు 03: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాలు ప్రకారం బుధవారం "అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం" సంధర్భంగా పెదవేగి మండలం విజయరాయి గ్రామ పరిధి ప్రకాష్ నగరులోని డి సాలెస్ విభిన్న ప్రతిభావంతుల పాఠశాల నందు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాదు  అవగాహన అవగాహన సదస్సును నిర్వహించారు.  

ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాదు మాట్లాడుతూ వివిధ సమస్యలతో బాధపడే విభిన్న ప్రతిభావంతులు సమస్యలను పరిష్కరించి, వారికి ఆసరా ఇవ్వవలసిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. సమాజంలో మనతో సమానంగా గౌరవంగా జీవించేలా అన్ని హక్కులు పొందేలా చూడడం కోసం 1992లో ఐక్య రాజ్యసమితి ఆధ్వర్యంలో ఈ దినోత్సవం మొదలైందని తెలిపారు. 

1998 నుండి ప్రతి సంవత్సరము విభిన్న ప్రతిభావంతులకు సంబంధించిన ఈ అంశంతో ఈ దినోత్సవాన్ని నిర్వహించు కుంటున్నామని అన్నారు. సమాజంలో గౌరవముగా జీవించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించుకుంటూ, పురోగతి సాధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై మరింత విశ్లేషణతో ముందుకు వెళ్ళటానికి ఈ దినోత్సవ నిర్వహించుకుంటున్నామని తెలిపారు. విభిన్న ప్రతిభా వంతులు సంక్షేమం కోసం ప్రత్యేక చట్టాలను ఏర్పాటు చేసి వాటి అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని  వారి యొక్క సంక్షేమం, విద్య, వైద్యం, ఆహారం మొదలైన విషయాల పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని సూచించారు.


అలాగే ఈ బాలలకు ప్రత్యేక చట్టం ద్వారా వీరి అభివృద్ధికి మరింత కృషి జరుగుతుందని, అలాగే జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ బాలల సంక్షేమం పథకం 2024  ద్వారా  మరిన్ని సౌకర్యాలు కల్పించేలా న్యాయ సేవాధికార సంస్థలను కూడా భాగం చేశాయని తెలియజేశారు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఈ ప్రత్యేక పథకాలు అమలు సమీక్ష ఉంటుందని ఈ పథకాలను పొందటంలో గాని మరి ఏ ఇతర సమస్యలు ఎదురైన జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించ వచ్చునని సూచించారు.

కార్యక్రమంలో డి సాలెస్ విభిన్న ప్రతిభావంతుల పాఠశాల ప్రిన్సిపల్ సిస్టర్ శాంతి, పెదవేగి పోలీసు స్టేషన్ ఏఎస్ఐ లక్ష్మీనారాయణ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.