'రైతన్న మీకోసం' వర్క్ షాప్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్


ఏలూరు, డిసెంబర్, 3 :  పెదపాడు మండలం అప్పనవీడు గ్రామంలో 'రైతన్న మీకోసం.' వర్క్ షాప్ లో బుధవారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అప్పనవీడు రైతు సేవ కేంద్రంలో ఏర్పాటు  చేసిన కార్యక్రమంలో  కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ  వ్యవసాయం, అనుబంద రంగాల శాఖల సిబ్బంది  రైతుల ఇళ్లకు వెళ్లి ఆధునిక వ్యవసాయ పద్ధతులతో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధనతో ' రైతులకు  అవగాహన కలిగించడం రైతన్న మీకోసం.' కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు.     

రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. మరింత విస్తీర్ణంలో ప్రకృతి సాగుచేసేలా రైతులలో అవగాహన పెంచాలని వ్యవసాయాధికారులు కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో పొలంపిలుస్తోంది, పొలంబడి కార్యక్రమాలు నిర్వహించి సాగులో ఉత్తమ యాజమాన్య పద్దతులపై రైతులకు అవగాహన కలిగిస్తున్నామన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై అందించడమే కాక 'అన్నదాత సుఖీభవ' పధకం కింద రెండు విడతలలో  లక్షా 60 వేల  968 మంది రైతులకు 213. 31 కోట్ల రూపాయలు ఆర్ధిక సహాయాన్ని ప్రభుత్వం అందించిందన్నారు.  

సాగులో యాంత్రీకరణను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని, జిల్లాలో 60 డ్రోన్లను రైతులకు అందించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, వ్యవసాయంలో సాంకేతికత, ఆహార శుద్ధి, ప్రభుత్వ మద్దతు. పాడి రైతులకు అండ  వంటి  పంచ సూత్రాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు, వాటిని ప్రతీ రైతు వినియోగించుకునే విధానాలపై రైతుల ఇంటివద్దకు వెళ్లి ప్రతీ  రైతుకు వ్యవసాయ, అనుబంధాల రంగాల సిబ్బంది 15 రోజులపాటు  తెలియజేశారన్నారు.  

ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రైతులను ఉద్దేశించి ప్రసంగించిన కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా రైతులతో పాటు అధికారులు తిలగించారు.  జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా, తహసీల్దార్ కృష్ణజ్యోతి, ఎంపిడిఓ, ఏ డిఏ  అనిల కుమారి, ఎంఏ ఓ షేక్ ఇమామిఖాసిమ్,  ఏరువాక కేంద్రం ఏలూరు శాస్త్రవేత్త ఎన్ నాగేంద్రబాబు, పెద్దపాడు మండల నాయకులు రవి, గుప్తా అనిల్, వ్యవసాయం, అనుబంధ రంగాల శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.