వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి భారీగా తరలివచ్చిన భక్తులు
ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలం, గురవాయిగూడెం, డిసెంబర్ 30: వైకుంఠ ఏకాదశి మరియు మంగళవారం శుభసందర్భాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో ఉన్న తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువుగా వెలసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దర్శనార్థం భక్తులు భారీగా తరలివచ్చారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
భక్తులు శ్రీ స్వామి వారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. అలాగే శ్రీ స్వామివారికి అత్యంత ప్రీతికరమైన నాగవల్లి దళములు (తమలపాకులు) సమర్పిస్తూ అష్టోత్తర పూజలు నిర్వహించారు. అన్నప్రాసనలు, వాహన పూజలు ఆలయ అర్చకులచే భక్తుల అభ్యర్థన మేరకు నిర్వహించబడ్డాయి.
శ్రీ మద్ది ఆంజనేయస్వామి దేవస్థానానికి ఉపాలయంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు, భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు స్వామివారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో వారికి వేద ఆశీర్వచనం గావించి, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
మధ్యాహ్నం/సాయంత్రం గం. 3.00 వరకు సుమారు 4,950 మంది భక్తులకు శ్రీ స్వామివారి నిత్య అన్నదాన సత్రం ద్వారా అన్నప్రసాద వితరణ జరిపినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే సాయంత్రం గం. 5.00 వరకు వివిధ సేవల రూపేణా రూ.4,45,370/-ల ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు.
భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేసినట్లు ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారిణి శ్రీమతి ఆర్.వి. చందన తెలిపారు.















Social Plugin