పెట్టుబడిదారులకు అన్ని విధాలా సహాయ సహకారాలు
ఎంవోయూలను క్షేత్రస్థాయిలో కార్యరూపంలోకి తీసుకెళ్తాం
– జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ
ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబర్ 30: ప్రభుత్వ దార్శనికతతో పాటు గౌరవ ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త నినాదాల సాధనకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ స్పష్టం చేశారు. జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన అన్ని విధాలా సహాయ సహకారాలు పెట్టుబడిదారులకు అందిస్తామని ఆమె తెలిపారు.
మంగళవారం కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో, ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన పార్ట్నర్‌షిప్ సమ్మిట్–2025 సందర్భంగా అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకున్న పారిశ్రామికవేత్తలతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ ఒప్పందాలకు క్షేత్రస్థాయిలో కార్యరూపం దాల్చేలా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూ సంబంధిత అంశాలు, మౌలిక వసతులు, అనుమతులపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. విజయవాడ, నందిగామ, తిరువూరు డివిజన్ల పరిధిలో ల్యాండ్ బ్యాంక్ వివరాలతో సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని ఆర్డీవోలను ఆదేశించారు. రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకొని పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించాలన్నారు.
నిరంతర సమీక్షల ద్వారా లోటుపాట్లను సవరించుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తెలిపారు. ప్రత్యేక సమావేశాల ద్వారా భూమి సంబంధిత సమస్యలను వేగవంతంగా పరిష్కరించడంతో పాటు, అధికారులు–పరిశ్రమల మధ్య సమన్వయం మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
స్థానికంగా ఉపాధి అవకాశాల విస్తరణ, జిల్లా స్థూల ఉత్పత్తి (జీడీడీపీ) వృద్ధి వంటి లక్ష్యాల సాధనకు పరిశ్రమల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో రాంకో సిమెంట్స్, అమరావతి బోటింగ్ క్లబ్, నవతరం సినీ స్టూడియోస్ తదితర సంస్థలకు చెందిన పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. అలాగే ఏపీఐఐసీ, జిల్లా పరిశ్రమల కేంద్రం, పర్యాటక శాఖ అధికారులు హాజరయ్యారు.















Social Plugin