భక్తులకు సేవలే మన సంస్కృతి బలం: జెడ్పీ చైర్‌పర్సన్‌ పద్మశ్రీ, ఎమ్మెల్యే బడేటి చంటి


ఏలూరు, డిసెంబర్ 12: ఆధ్యాత్మిక భావనతో చేసే సేవలే ప్రజల మన్ననలు సంపాదిస్తాయని జెడ్పీ చైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఇంద్రకీలాద్రి కొండకు కాలినడకగా వెళ్లే దీక్షాదారుల కోసం ఏలూరు పోస్టర్ కాలనీ 7వ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ఒక్కరోజు అల్పాహారం, అన్నప్రసాద పంపిణీ కేంద్రం మరియు ఉచిత వైద్య శిబిరాన్ని శుక్రవారం ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు.


ప్రారంభోత్సవం అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించగా, వివిధ ప్రాంతాల నుండి ఏలూరు మీదుగా విజయవాడకు కాలినడకన వెళ్లుతున్న భవానీలకు అల్పాహారం, పండ్లు అందజేశారు. భవానీల సౌకర్యం కోసం చేపట్టిన ఈ కార్యక్రమాలు భక్తుల్లో ఆనందాన్ని కలిగించాయి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, రాజకీయాలతో పాటు భక్తులకు సేవలు అందించడం మహత్తర కర్తవ్యమని, జెడ్పీ చైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ చేపట్టిన సేవా కార్యక్రమాలు అత్యంత ఆదర్శనీయమని అన్నారు. భవానీలకు కావలసిన సహకారాన్ని అందించడంలో జిల్లా ప్రజాప్రతినిధులు ముందుండాలని పిలుపునిచ్చారు.

చైర్‌పర్సన్‌ పద్మశ్రీ మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి భక్తులకు మరింత సహాయాన్ని అందించనున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎఎంసి చైర్మన్‌ మామిళ్లపల్లి పార్థసారధి, కార్పొరేటర్‌ కలవకొల్లు సాంబ, ఘంటా ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.