అటల్‌ విగ్రహావిష్కరణ దెందులూరుకు గర్వకారణం – ఉపాధి హామీ కొత్త నిబంధన నుంచి ఏపీకి వెసులుబాటు ఇవ్వాలి: ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్


ఏలూరు జిల్లా, దెందులూరు, డిసెంబర్‌ 22: ఏలూరు శివారు ఆశ్రమం జంక్షన్‌లో నిర్వహించిన "అటల్ మోదీ సుపరిపాలన యాత్ర"లో భాగంగా భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పాయీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షులు అన్నామలై, కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, ఏపీ బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, జాతీయ రహదారులు, గ్రామ సడక్ యోజన వంటి పథకాల ద్వారా గ్రామాలను పట్టణాలతో అనుసంధానించిన గొప్ప నాయకుడు, దేశానికి అణుశక్తి సామర్థ్యాన్ని అందించిన దూరదృష్టి గల మహనీయుడు అటల్ బిహారీ వాజ్‌పాయీ విగ్రహం తమ నియోజకవర్గ పరిధిలో ఆవిష్కరణ జరగడం గర్వకారణమని అన్నారు. సాహిత్యం, సహనం, సమన్వయం, స్థిర ప్రజ్ఞత కలగలిసిన నాయకుడు వాజ్‌పాయీ అని కొనియాడారు.

అనంతరం ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన కీలక విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఉపాధి హామీ పథకంలో కేంద్ర–రాష్ట్ర వ్యయ నిష్పత్తిని 60:40గా మార్చిన నేపథ్యంలో, విభజన ప్రభావాలు మరియు గత పాలన కారణంగా ఆర్థికంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఈ నిబంధన మరింత భారంగా మారుతుందని పేర్కొన్నారు. ఈ కొత్త నిబంధనను ఏపీకి వర్తింప చేయకుండా వెసులుబాటు కల్పించాలని కేంద్ర మంత్రులు, బీజేపీ రాష్ట్ర నాయకత్వం చొరవ తీసుకుని కేంద్రంతో మాట్లాడాలని కోరారు.

ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రైతు కూలీలు, కార్మికులు, పేదలు జీవనాధారం పొందుతున్నారని, ఈ పథకం కొనసాగింపుతోనే గ్రామస్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. ఎన్డీఏ కుటుంబ సభ్యుడిగా, కేంద్ర ప్రభుత్వంపై ఉన్న గౌరవంతోనే ఈ విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు.